జేసీ దివాకర్ రెడ్డి.. తన అవసరం మేరకు చాలా భోళాగా మాట్లాడే నేత! తన అవసరం కోసం ఎవరి భజన అయినా చేస్తూనే, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతానంటూ తనకు తాను ముక్తాయింపును ఇచ్చుకునే నేత! ఇన్నేళ్లూ దివాకర్ రెడ్డికి అలానే గడిచాయి. తమ అవసరం కోసం పార్టీలు మారి కూడా ఆ పార్టీలకే తమ అవసరం ఉందన్నట్టుగా అనిపించారు జేసీ సోదరులు. అయితే ఒక్క ఎన్నికల ఫలితం మొత్తం కథను మార్చేసింది. అనంతపురం లోక్ సభ, తాడిపత్రి అసెంబ్లీ సీట్ల నుంచి జేసీ కుటుంబీకులు ఓడిపోవడంతో వీళ్ల ఇమేజ్ కు భారీ డ్యామేజ్ కూడా కలిగింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అర్థం లేని కసిని చూపించి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు ప్రజల్లో కూడా పలుచన అయ్యారు. సొంత కులం ఓట్లు దండిగా ఉన్న, సొంత నియోజకవర్గంలో ఓటమితో వీళ్ల వ్యవహారాలన్నీ ఉల్టాపల్టా అయ్యాయి. అయితే గమనించాల్సిన అంశం ఏమిటంటే… ఓటమి తర్వాత కూడా జేసీ దివాకర్ రెడ్డి తీరులో మొదట్లో మార్పు రాలేదు!
తనదేదో సూపర్ స్టైల్ అన్నట్టుగా తన స్టైల్లోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. జగన్ విషయంలో మళ్లీ అనుచితమైన వ్యంగ్యాన్నే వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. తనకు మాలిన వ్యవహారాల్లో ఆయన స్పందించారు. పరిస్థితులను అర్థం చేసుకోలేనట్టుగా వ్యవహరించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత జేసీల ఆర్థిక వ్యవహారాలు చాలా వరకూ దెబ్బతిన్నాయని అంటారు. అంటే అంత వరకూ అయాచితంగా వచ్చిన ఆదాయాలు దెబ్బతిన్నాయని తాడిపత్రి స్థానికులు అనుకుంటూ ఉంటారు. ఆ కోపంతోనే స్పందించారేమో కానీ.. జగన్ ను నియంత అంటూ అభివర్ణిస్తున్నట్టుగా జేసీ దివాకర్ రెడ్డి ఒకటీ రెండు సార్లు స్పందించారు. ఇక ప్రభాకర్ రెడ్డి ఇంటర్వ్యులు ఇచ్చి తమను ఎవరూ ఏం చేసుకోలేరని, ట్రావెల్స అక్రమాలను బయటపెట్టి జగన్ ఒకరకంగా తమకు
మంచే చేశాడని, కరోనాతో చాలా ట్రావెల్స్ యాజమాన్యాలు నష్టపోతున్న తరుణంలో తమకు ఊరట దక్కిందని, బస్సులన్నీ అమ్మేసి తాము సేఫ్ సైడుకు వెళ్లిపోయినట్టుగా ప్రబాకర్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ట్రావెల్స్ అక్రమాలు రుజువైనా తమకు పెద్ద శిక్ష పడదని, తాము మహా అంటే పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని తమకు పడే శిక్ష గురించి కూడా ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇవన్నీ అరెస్టు జరగక ముందు మాటలు!
ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ ల అరెస్టు తర్వాత జేసీల తీరులో చాలా మార్పు కనిపిస్తూ ఉంది. లోకేష్ వెళ్లి పరామర్శించారు. ఏం పరామర్శించారో కానీ.. డైనింగ్ టేబుల్ ఫొటో వైరల్ అయ్యింది. అప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి వీరావేశంతో మాట్లాడలేదు. అంతకు ముందు జగన్ విషయంలో ఇష్టానుసారం మాట్లాడిన వాళ్లు కాస్తా నెమ్మదించారు. కామ్ అయ్యారు.
మరోవైపు తాము చేసి నేరానికి పెనాల్టీ మాత్రమే పడుతుందని తేల్చిన ప్రభాకర్ రెడ్డికి ఎక్కడా బెయిల్ దొరకడం లేదు. అరెస్టైన తొలి రోజు విక్టరీ సంకేతం చూపిన ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత విచారణలకు హాజరవుతున్నప్పుడు ఆ జోష్ తో కనిపించడం లేదు. జేసీ దివాకర్ రెడ్డి ఏ ప్రెస్ మీటో పెట్టి.. ముందులా దుమ్మెత్తిపోయడమూ లేదు! ఇప్పుడు.. ఇలా.. జేసీ సోదరుల తీరులో స్పష్టైన మార్పే కనిపిస్తున్నట్టుంది!