తల్లి నేర్పించిన వంట తల్లికే రుచి చూపిస్తానంటూ చిరంజీవి చేసిన చేపల పులుసు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే చిరు అనుకుంది ఒకటైతే.. అక్కడ జరిగింది మరొకటి. సోషల్ మీడియాలో చిరు చేపల పులుసుపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. కొవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగిన రోజే చిరు ఈ చేపల పులుసు కార్యక్రమానికి టీజర్ వదలడం, ఆ వెంటనే ఆయన దాన్ని వాయిదా వేయడం, సోమవారం ఆటవిడుపుగా ఆ వీడియోని అప్లోడ్ చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి.
అయితే రాష్ట్రం మొత్తం కరోనా వల్ల ఒకరకమైన సీరియస్ మూడ్ లో ఉంది. ఇలాంటి టైమ్ లో ఈ “చిరు” ప్రయత్నం బెడిసికొట్టింది. అన్నయ్యను ఓ రేంజ్ లో ఆటాడేసుకున్నారు నెటిజన్లు. సోనూసూద్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేశారు. సోషల్ మీడియాను సోనూ సూద్ పేదలను ఆదుకోడానికి ఉపయోగిస్తుంటే.. చిరంజీవి మాత్రం ఇలా చేపల పులుసు, వంటావార్పులకు ఉపయోగిస్తున్నారంటూ సెటైర్లు వేశారు కొంతమంది.
అయితే దీన్ని ఓ ఆటవిడుపుగా మాత్రమే చూడాలని చిరంజీవి ప్రయత్నం. అందులోనూ అమ్మ సెంటిమెంట్ కలిపారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. సోనూ సూద్ ఏంచేశారు, చిరంజీవి ఏం చేస్తున్నారనేదే బాగా హైలెట్ అయింది. సోనూ సూద్ ఔదార్యం ముందు చిరంజీవి చేపల పులుసు తేలిపోయింది. కనీసం సోనూని చూసైనా నేర్చుకో అన్నయ్యా అంటూ చురకలంటించారు తమ్ముళ్లు.
నిజానికి సోనూసూద్ అంత కాకపోయినా తన వంతు తాను కరోనా కష్టకాలంలో నిరుపేద కళాకారులకు సాయం చేశారు చిరంజీవి. తానే చొరవ తీసుకుని కరోనా క్రైసిస్ చారిటీ ఫండ్ ఏర్పాటు చేసి ఇండస్ట్రీ కార్మికులకు సాయం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తనవంతు ఆర్థిక సాయం అందించారు. అంతే కాదు, ఎప్పటికప్పుడు మాస్క్ ల వినియోగంపై ప్రజలకు సూచనలు అందిస్తూనే ఉన్నారు. మిగతా హీరోలంతా కనీసం గడప దాటడానికే ఇబ్బంది పడుతున్న టైమ్ లో చిరంజీవి ఏకంగా ప్లాస్మా దానంపై అవగాహన కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీసులందరితో కలసి పాల్గొన్నారు.
అయితే అక్కడ సోనూసూద్ తో పోలిక పెట్టుకుంటే మాత్రం మనోళ్లు ఎవ్వరూ సరిపోవడంలేదు. సోనూసూద్ చేస్తున్న గొప్ప పనుల ముందు చిరు చేస్తోంది నిజంగా చిరుసాయంగా మిగిలిపోతోంది. అందుకే చిరంజీవి చేపల పులుసుపై అన్ని సెటైర్లు పడ్డాయి. చిరు వీడియోకి వచ్చిన పాజిటివ్ కాంప్లిమెంట్స్ కంటే.. నెగెటివ్ కామెంట్సే ఎక్కువ.
బహుశా ఇలాంటి టైమ్ లో చిరంజీవితో పాటు మిగతా నటీనటులంతా ఇలాంటి ఆటవిడుపులకు దూరంగా ఉంటే మంచిదేమో. ఎందుకంటే అక్కడ సోనూ సూద్ ఉన్నాడు. మన హీరోల పాలిట నిజంగా “విలన్”గా మారాడు.