ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెన్నై ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, 70 శాతం ఆయన శరీరం వైద్యానికి సహకరిస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 5న ఆయన కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నానని, పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. త్వరగా కోలుకుని తిరిగి వస్తానని, అభిమాను లెవరూ ఆందోళన చెందొద్దని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణించిందనే వార్తలు గుప్పుమనడంతో ఒక్కసారిగా టాలీవుడ్, కోలీవుడ్ షాక్‌కు గురయ్యాయి. నిన్న రాత్రి ఊపిరి పీల్చుకోవడం కష్టమవడంతో ఆయన్ని ఐసీయూకి తరలించి నిపుణులైన వైద్యులు చికిత్స అందిస్తున్నట్టు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
కాగా ఎస్పీ బాలు కుటుంబ సభ్యులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. తమకు దిక్కుతోచడం లేదని, ఎంజీఎం ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులిటెన్ సమాచారాన్ని తాము చెబుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతకు మించి తమకు కూడా ఏమీ తెలియదని వారంటున్నట్టు తెలుస్తోంది. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారు.