ఇష్టం అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది శ్రియ. ఆ తర్వాత సీనియర్లు-జూనియర్లు అనే తేడా లేకుండా అందరితో నటించి బిజీ హీరోయిన్ అయిపోయింది. తన ఖాతాలో చిరంజీవి, మహేష్ బాబు, బాలకృష్ణ సినిమాల్ని కూడా వేసుకుంది. అయితే శ్రియ ఎంట్రీ అనుకోకుండా జరిగింది. నిజానికి ఆమె ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమా ఇష్టం కాదు. ఆ సినిమా పేరు ఆనందం.
అవును.. శ్రీనువైట్ల డైరక్ట్ చేసిన సూపర్ హిట్ మూవీ ఆనందంతో శ్రియ హీరోయిన్ గా పరిచయమవ్వాల్సింది. కానీ అది మిస్సయింది. అది ఎందుకు మిస్సయిందనే విషయాన్ని తాజాగా శ్రీనువైట్ల బయటపెట్టాడు.
“ఆనందం సినిమా కోసం హీరోయిన్ ను వెదుకుతున్నాం. ఓ మ్యాగజైన్ లో అనుకోకుండా శ్రియను చూశాను. ఆమె అయితే కరెక్ట్ అని అనుకున్నాం. చాలా కష్టపడి ఆమె కాంటాక్ట్ పట్టుకున్నాం. ఆమెను సంప్రదించాం. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. కానీ అంతలో మా సినిమా లేట్ అయింది. దీంతో రామోజీరావు గారు, శ్రియను ఇష్టం అనే సినిమా కోసం హీరోయిన్ గా ఫిక్స్ చేశారు.”
అలా శ్రియను ఇండస్ట్రీకి పరిచయం చేసే అవకాశం మిస్సయిందని చెప్పుకొచ్చాడు వైట్ల. ప్రాసెస్ అంతా తాము చేస్తే, మరో సినిమాకు ఆమెను షిఫ్ట్ చేశారని చెప్పుకొచ్చాడు. అయితే ఆరంభంలో లేట్ అయినా, త్వరగా షూటింగ్ పూర్తిచేసి, తమ సినిమానే ముందుగా థియేటర్లలోకి తీసుకొచ్చామన్నాడు వైట్ల. కేవలం 45 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి, రిలీజ్ చేసిన ఆనందం సినిమా రీసెంట్ గా 20 ఏళ్లు పూర్తిచేసుకుంది.