ఏపీలో ఏరివేతలు మొదలు.. వారికి బ్యాండ్ బాజానే..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్షేమ పథకాల అమలుతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయ ఢంకా మోగిస్తుందనే నమ్మకం అధికార పార్టీలో ఉంది. కానీ ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం…

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఫుల్ స్వింగ్ లో ఉంది. సంక్షేమ పథకాల అమలుతో వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయ ఢంకా మోగిస్తుందనే నమ్మకం అధికార పార్టీలో ఉంది. కానీ ఎన్నికలను అంత తేలిగ్గా తీసుకోవడం మాత్రం జగన్ కి ఇష్టంలేదు. ఎందుకంటే 2014లో కూడా విజయం మాదే అనే ధీమాతో ఉన్న జగన్ కి బాబు చుక్కలు చూపెట్టారు. 2019లో బాబుపై విసిగిపోయి జనం, జగన్ పై ఆశతో పట్టం కట్టారు. ఆ ఆశను, ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని జగన్ నిలబెట్టుకున్నారు.

కానీ ఎక్కడో బాబు నక్కజిత్తులపై చిన్న అనుమానం. వ్యవస్థల్ని గుప్పెట పట్టిన బాబు.. స్థానిక ఎన్నికల సమయంలో ఎన్ని జిత్తులు పన్నారో, వైసీపీని ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. అంతిమ ఫలితం వైసీపీకే అనుకూలంగా వచ్చినా.. ఆలోపు కోర్టు మెట్లెక్కడం, అనవసర విమర్శలు కాచుకోవాల్సి రావడంతో జగన్ ఇబ్బంది పడిన మాట వాస్తవం. రెండోసారి అలాంటి తప్పు జరగకుండా చూడాలనుకుంటున్నారు జగన్. అందుకే ముందుగా అస్మదీయుల్లా నటించే తస్మదీయులపై వేటు వేసేందుకు సిద్ధపడ్డారు.

ఎన్నికల మూడ్ లో అధికారులపై ఫోకస్..

రెండేళ్ల ముందుగానే వైసీపీ ఎన్నికల మూడ్ లోకి వెళ్తోంది. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఉన్న అధికారులపై ఫోకస్ పెట్టారు. గతంలో ఆర్థిక శాఖలో కీలక సమాచారం లీక్ చేసిన అధికారులపై వేటు వేసి ఓ దఫా అందరికీ హెచ్చరికలు పంపారు జగన్. ఇప్పుడు అనుమానంగా ఉన్నవారిని పూర్తిగా పక్కనపెట్టేందుగు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఏపీలో ఉన్న కీలక అధికారుల్లో టీడీపీ సానుభూతిపరులు ఎవరైనా ఉన్నారా..? బాబుతో ఇంకా టచ్ లో ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. మరో 2-3 నెలల్లో ఆ లిస్ట్ ప్రిపేర్ అవుతుందని చెబుతున్నారు.

వారిని ఏం చేస్తారు..?

గతంలో ఇద్దరు ఐపీఎస్ అధికారుల్ని కూడా ఇలాగే పక్కనపెట్టారు సీఎం జగన్. ఐజీ స్థాయి అదికారులకు ఎలాంటి ప్రయారిటీ ఇవ్వకుండా లూప్ లైన్ లో పెట్టేశారు. వీరిలాగే ఇంకెవరైనా ఐఏఎస్, ఐపీఎస్ లు ఉన్నారా అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వీరు సత్సంబంధాలు కోరుకుంటున్నారా అనే విషయంలోనూ సమాచారం సేకరిస్తున్నారు.

ఇప్పటివరకూ జగన్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఇద్దరు ఐఏఎస్ లు, ముగ్గురు ఐపీఎస్ లు అనుమానితుల జాబితాలో ఉన్నారు. వీరి విషయంలో పక్కా ఆధారాల కోసం జగన్ వేచి చూస్తున్నారు. ఒకవేళ వారిపై ఆధారాలు దొరికితే మాత్రం వారి ప్రయారిటీ తగ్గించేస్తారు. విధాన పరమైన నిర్ణయాలు తీసుకోలేని అప్రాధాన్య పోస్టుల్లోకి పంపించేస్తారు.

మొత్తమ్మీద ప్రతిపక్షాల గేమ్ ప్లాన్ ని ఇప్పటినుంచే పక్కాగా అర్థం చేసుకుంటున్నారు జగన్. ఇప్పటివరకూ టీడీపీ అనుకూల మీడియాతోనే యుద్ధం చేసేవారు. ఇప్పుడు వ్యవస్థల్లో ఉన్న వ్యతిరేకులని కూడా ఓ కంట కనిపెడుతూ వారి ఆట కట్టించాలనుకుంటున్నారు.