శ్రీరెడ్డి…ఈమె పేరు వింటే భయానికే భయం. అలాంటిది ఆమెను భయపెట్టాలనుకుంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో ఆమెపై కేసులు పెట్టిన కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్‌ను అడిగితే తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని రోజులుగా శ్రీరెడ్డి పేరు మరోసారి తరచూ వినిపిస్తోంది. దీనికి కారణం హైదరాబాద్‌లో ఆమెపై సాటి కళాకారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు కావడమే.
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో తీవ్ర దుమారం రేపిన శ్రీరెడ్డి…తెలుగు రాష్ట్రాలను విడిచి చెన్నైకి వెళ్లింది. పాపం రామేశ్వరం పోయినా శనేశ్వరం పోనట్టుగా ఉంది ఆమె పరిస్థితి. సోషల్ మీడియాలో తమపై అసభ్య దూషణలతో అరోపణలు చేస్తోందంటూ శ్రీరెడ్డిపై కరాటే కల్యాణి, మాస్టర్ రాకేశ్ హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, టీవీ డిబేట్లలో శ్రీరెడ్డిపై ఘాటైన విమర్శలను వాళ్లిద్దరు చేశారు.
దీంతో శ్రీరెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. తన జోలికి వస్తే విడిచి పెట్టే ప్రశ్నే లేదని హెచ్చరించింది. శ్రీరెడ్డి హెచ్చరించినట్టేగానే తాజాగా తనపై నటి కరాటే కల్యాణి, నృత్య దర్శకుడు రాకేశ్ హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెన్నై పోలీస్ కమీషనర్ కార్యాలయంలో శ్రీరెడ్డి ఫిర్యాదు చేసింది.
తాను తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నానని, ఇల్లు, కారు కొన్నానని, దీనిపై కల్యాణి, రాకేష్ సోషల్ మీడియాలో తన గురించి అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తనను పెట్రోలు పోసి తగలపెడతామని బెదిరిస్తున్నారంటూ శ్రీరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో మరోసారి వీళ్ల వ్యవహారం వీధికెక్కింది. ఇది ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి మరి.