ఓ మంచి ఉద్యోగం దొరికినప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయడం సహజం. కాకపోతే దీనికి సంబంధించి అప్పుడప్పుడు నోటీస్ పీరియడ్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ గ్రామ సచివాలయ ఉద్యోగం వదిలేయడం మాత్రం అంత ఈజీ కాదు. అవును.. ఒక్కసారి విధుల్లో చేరిన తర్వాత తిరిగి ఆ జాబ్ వదిలేయాలనుకుంటే అప్పటివరకు పొందిన జీతం, అనుభవించిన అలవెన్సులన్నీ ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిందే.
ఇదేదో కొత్తగా తీసుకొచ్చి పెట్టిన నిబంధన కాదు. గ్రామ సచివాలయ కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టిన టైమ్ లోనే సీఎం జగన్ ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అంతేకాదు.. తొలిసారిగా పంచాయతీ సెక్రటరీ పోస్టుల నియామక పత్రాలు ఇచ్చిన రోజు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కానీ టీడీపీ నేతలు మాత్రం దీన్ని కూడా రాద్దాంతం చేస్తున్నారు. ఉద్యోగం వదిలేసినప్పుడు జీతం తిరిగి చెల్లించడం అమానుషం అంటున్నారు.
నిజానికి ఈ నిబంధన పెట్టింది గ్రామ సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకే. అది కూడా తొలి ఏడాది మాత్రమే. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదిలోపు ఆ ఉద్యోగాన్ని వదులుకునే పక్షంలో మాత్రమే జీతాన్ని తిరిగి వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత ఉద్యోగం విడిచిపెడితే ఎలాంటి ఆంక్షలు లేవు. ప్రభుత్వ కార్యక్రమాలు సజావుగా సాగడంతో పాటు సచివాలయ వ్యవస్థ గాడిలో పడుతుందని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిలోనే వేల మంది ఉద్యోగాలు వదిలేస్తే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కుంటుపడతాయి కాబట్టి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ చిన్న లాజిక్ ను మాత్రం టీడీపీ నేతలు వదిలేస్తున్నారు. ఏడాదిలోపే ఉద్యోగాన్ని వదిలేసిన పక్షంలో మాత్రమే జీతం డబ్బు వెనక్కి ఇవ్వాలనే అంశాన్ని వాళ్లు ప్రస్తావించడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో ఓ ఉద్యోగి ఇలానే రాజీనామా చేస్తూ తన జీతాన్ని వెనక్కి ఇవ్వాల్సి వచ్చింది. దీనికి అక్కడి స్థానిక టీడీపీ నేతలు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. అనంతపురంలోనే కాదు.. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయి.
టీడీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికంటే ముందు, ఈ నిబంధనపై ఉద్యోగార్థుల్లో అవగాహన కల్పించడమే దీనికి సరైన పరిష్కార మార్గం. ఈ దిశగా అధికారులు మరింత ప్రచారం కల్పిస్తే అందరికీ మంచిది. లేదంటే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే నిజమని నిరుద్యోగులు నమ్మే ప్రమాదం ఉంది.