cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

ప్రతి పౌరుడినీ భయపెట్టడమే లక్ష్యమా?

ప్రతి పౌరుడినీ భయపెట్టడమే లక్ష్యమా?

స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేశాడో లేదో తర్వాతి సంగతి. కానీ.. మేష్టారు పిలిచి.. ‘రేపు మీనాన్నని స్కూలుకు రమ్మను’ అన్నాడంటే చాలు.. వాడు వణికిపోతాడు. నాన్నను ఎందుకు రమ్మన్నారో ఏమో.. అనే భయానికి గురవుతాడు. మేష్టారు ఏదో ఇతర పనిమీద పిలిచి ఉన్నా సరే.. తప్పుచేయని పిల్లవాడికి కూడా  భయం మాత్రం గ్యారంటీ. ఇప్పుడు మోడీ సర్కారు కూడా ఇంచుమించుగా ఇదే సూత్రాన్ని ఎన్నుకుంటోంది. దేశంలోని ప్రతి పౌరుడినీ.. ఇదే తరహా భయానికి గురిచేయడానికి చూస్తోంది.

ఇప్పుడు ఎన్‌పీఆర్ ద్వారా కేంద్రప్రభుత్వం అడగదలచుకుంటున్న వివరాలను గమనిస్తే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. జనాభా గణన వివరాలు సేకరించేప్పుడు సాధారణంగా 16 ప్రశ్నలు గతంలో ఉండేవి. ఇప్పుడు చాలా చాలా అసాధ్యమైన వివరాలు అడగబోతున్నారంటూ కొన్ని రోజులుగా పుకార్లు వస్తున్నాయి. ఇదమిత్థంగా పలానా అని తేలకపోయినప్పటికీ.. ఆ వివరాలన్నీ ప్రభుత్వానికి ఎందుకు? సమాధానం చెప్పడం ఎలా? అనే సందేహాలతోనే విమర్శించడం కూడా జరుగుతోంది.

అయితే తాజాగా సదరు కొత్త ప్రశ్నలు ఏంటనేది కూడా మీడియాకు లీకైంది. కొత్తగా 7 ప్రశ్నలు జత చేస్తున్నారని సమాచారం. వాటిలో పాస్ పోర్టు, గతంలో ఎక్కడ ఉండేవాళ్లో ఆ చిరునామా, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, సెల్ ఫోను నెంబరు వంటి వివరాల్ని నమోదు చేసుకుంటున్నారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడి మాతృభాష కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అన్నిటినీ మించి.. తల్లిదండ్రులు ఎక్కడ? ఎప్పుడు? పుట్టారనే వివరాలు కూడా వారికి చెప్పాలి.

ఇక్కడే వస్తోంది అసలు తగాదా! ఈదేశంలో ప్రభుత్వం తెస్తున్న చట్టాల గురించి, మార్పుల గురించి అవగాహన ఉండే ప్రజలు యాభైశాతం కూడా ఉండరు. అలాంటప్పుడు ప్రభుత్వం తమను ఏ వివరాలు అడిగినా.. ఆ వివరాలతో తమను ముందు ముందు ఎలా ఇబ్బందిపెడతారో అని అనుమానించే వాళ్లు భయపడేవాళ్లు ఎక్కువ. నిజానికి ఆధార్ సంఖ్య అడిగిన తర్వాత.. దానితో ముడిపడిన ఓటరు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు నెంబర్లను ప్రభుత్వం చిటికెలో తెలుసుకోగలదు. కానీ.. అవన్నీ ప్రజలను అడగడం అంటేనే.. వారు తప్పు చెబుతున్నారా? ఒప్పు చెబుతున్నారా? అని అనుమానిచడం అవుతుంది. ఎక్కువ వివరాలు అడిగేకొద్దీ ప్రజలకు అనుమానం పెరుగుతుంది.

ఈ దేశంలో తల్లిదండ్రులు ఎవరో తెలియనివాళ్లే లక్షలాది మంది ఉన్నారు. అలాంటప్పుడు తల్లిదండ్రుల పుట్టుక స్థలం.. తేదీ వివరాలు చెప్పడమంటే ఎందరికి తెలుస్తాయి? చెప్పకపోతే ఏం తంటా ముంచుకువస్తుందో..? కొత్త చట్టాల నేపథ్యంలో తమను దేశంలో ఉంచుతారో గెంటేస్తారో? అని ప్రజలు భయపడినా ఆశ్చర్యం లేదు. ప్రశ్నల సంఖ్యను పెంచడం ద్వారా ప్రభుత్వం ప్రజల్లో భయాలను కూడా పెంచుతోందనే అనిపిస్తోంది.

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది