మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కానీ ఆ క్రమంలో తెరపైకొచ్చిన వివాదాల సెగ మాత్రం ఇంకా రగులుతూనే ఉంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మొత్తం తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేయడం, మరోవైపు నరేష్ లాంటి వ్యక్తులు మరిన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మంటలు పెంచింది. ఇప్పుడీ మంటల్ని మరింత ఎగదోస్తోంది నటి శ్రీరెడ్డి.
తను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు ఆందోళన చేసినప్పుడు ఒక్కరు కూడా తనకు మద్దతుగా నిలవలేదని, తన కన్నీరు తుడవలేదని.. కానీ ఇప్పుడు మాత్రం అంతా రోడ్లపైకి వచ్చి గుక్కపెట్టి ఏడుస్తున్నారని ఎద్దేవా చేసింది శ్రీరెడ్డి. “అసోసియేషన్ కు సేవ చేస్తామంటున్నారు, ఎవరు సేవ చేస్తే ఏంటి. ఈ ఏడుపు ఎందుకు?” అని ప్రశ్నిస్తోంది.
చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు వేసిన ఎత్తులు ఈసారి పారలేదని, ఏళ్లుగా కొనసాగిన ఆధిపత్యం పోయినందుకు వీళ్లంతా ఏడుస్తున్నారని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరువు తీశానని ఒకప్పుడు హేమ, జీవిత, నాగబాబు లాంటి వ్యక్తులు తనను ఏడిపించారని.. కానీ ఇప్పుడు వాళ్లంతా కలిసి అసోసియేషన్ పరువును గంగపాలు చేశారని విమర్శించింది.
అసోసియేషన్ లో కమ్మ-కాపు కులాల ఫీలింగ్ బాగా వచ్చేసిందని కుండబద్దలుకొట్టిన శ్రీరెడ్డి.. దాసరి నారాయణరావు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే అర్హత ఒక్క మోహన్ బాబుకు మాత్రమే ఉందని చెప్పుకొచ్చింది.