టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికలు రగిల్చిన చిచ్చు ఇప్పల్లో ఆరిపోయేలా లేదు. ఆ మంట మరింత మండేందుకు ఏదో రకంగా ఆజ్యం పోస్తూనే వున్నారు. ఈ పరిణామాలు టాలీవుడ్‌లో అసౌకర్య వాతావరణాన్ని సృష్టిస్తున్నాయనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘మా’ ఎన్నికల అధికారిపై ప్రకాశ్‌రాజ్ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖలో మంచు మోహన్‌బాబు, నరేష్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రధానంగా ప్రకాశ్‌రాజ్ రాసిన లేఖలో ఎన్నికల నాటి సీసీటీవీ ఫుటేజీ కావాలని అడగడమే కావచ్చు. కానీ వీటి ద్వారా నరేష్, మోహన్‌బాబుల దుష్ప్రవర్తనను లోకానికి చాటి చెప్పాలనే కుతూహలం ఆయనలో కనిపిస్తోంది. ఈ లేఖలో వాళ్లిద్దరిపై ఆయన ప్రయోగించిన భాషే ఇందుకు నిదర్శనం.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ని లేఖ ద్వారా ప్రకాశ్‌రాజ్ కోరారు. ఆ లేఖలోని ముఖ్యాంశాలు.
‘మా ఎన్నికల నాడు ఎన్నో భయంకర ఘటనలు జరిగాయి. దానికి మీరే సాక్షి. మోహన్ బాబు, నరేశ్ ప్రవర్తన ఎలా ఉందో చూశాం. కొందరు ‘మా’ సభ్యులపై వారు దాడి చేశారు. మరో సందర్భంలో పరుష పదజాలం వాడారు. మోహన్‌బాబు, నరేష్ అసాంఘిక శక్తుల్లా ప్రవర్తించారు. దానికి సంబంధించిన కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. ఎన్నికల తర్వాత పరిణామాలు నవ్వు తెప్పించేలా ఉన్నాయి. ప్రజాభిప్రాయం కూడా ఇదే.
నిజం ఏంటో, పోలింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ‘మా’ సభ్యులు అనుకుంటున్నారు. పోలింగ్ సమయంలో సీసీ కెమెరాల గురించి మీరు వివరించారు. అన్నింటినీ మీరు రికార్డు చేసుంటారని భావిస్తున్నా. దాన్ని మాకు అందించాల్సిందిగా అభ్యర్థిస్తున్నా. పోలింగ్ అధికారిగా కనీసం మూడు నెలలు ఆ ఫుటేజీని భద్రపరచడం మీ బాధ్యత. మీరు వెంటనే స్పందించకపోతే అది డిలిట్ అయ్యే అవకాశాలున్నాయి’ అని లేఖలో ఆయన పేర్కొన్నారు.
ఇదిలా వుండగా ప్రకాశ్‌రాజ్ లేఖపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వెంటనే స్పందించారు. ఎన్నికలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ భద్రంగానే ఉందని తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం ఫుటేజ్‌ని ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ లేఖపై మంచు విష్ణు ప్యానల్ , అలాగే మోహన్‌బాబు, నరేష్‌ల స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే మోహన్‌బాబు, నరేష్‌లను అసాంఘిక శక్తులుగా ప్రకాశ్‌రాజ్ చిత్రీకరించడం తీవ్ర దుమారం రేపుతోంది.