‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందడంపై ఆయన తండ్రి మోహన్‌బాబు ఆనందానికి అవధుల్లేవు. ‘మా’ నూతన అధ్యక్షుడైన తన కుమారుడిని వెంటబెట్టుకుని ప్రముఖుల్ని ఆయన కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా మంచు విష్ణు గెలుపులో భాగస్వాములైన వారిని ప్రాధాన్యత క్రమంలో కలుస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా మొట్టమొదటగా నందమూరి బాలకృష్ణను మంచు విష్ణు, మోహన్‌బాబు ఇవాళ కలిసి కృతజ్ఞతలు చెప్పారు.
బాలకృష్ణతో ప్రస్తుత టాలీవుడ్ పరిస్థితులపై తండ్రీతనయుడు చర్చించారని సమాచారం. అలాగే ఈ నెల 16న జరగనున్న విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని బాలయ్యని కోరారు. బాలయ్యతో భేటీ అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బాలకృష్ణ ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. అన్నయ్య ఎన్టీ.రామారావు గారే తనను బాలయ్య ఇంటికి పంపిం చినట్లు మోహన్‌బాబు చెప్పడం గమనార్హం. గత సాధారణ ఎన్నికల సమయంలో మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేశ్ ఓటమికి తాను వైసీపీ తరపున ప్రచారం చేశానన్నారు.
కానీ, ఆయన అవేమీ మనసులో పెట్టుకోకుండా ‘మా’ ఎన్నికల్లో తన కుమారుడు విష్ణుకి మద్దతు ఇచ్చారని ఆనందంతో చెప్పారు. విష్ణుకి ఓటు వేసి.. గెలిపించారన్నారు. అలాగే ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని బాలయ్య గతంలో చెప్పిన సంగతిని మోహన్‌బాబు గుర్తు చేశారు.