సినిమా తారలకు సంబంధించిన ప్రతీదీ విశేషమే. సినిమాల వల్ల వారిపై కలిగే ఆసక్తి ఫలితంగా వారి పర్సనల్ లైఫ్ పై అందరి చూపూ పడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి దేశం, కాలం రెండూ అతీతం కాదు! హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, కోలీవుడ్ అయిన మరే వుడ్ అయినా… అమెరికా అయినా ఇండియాలో అయినా, ఇండియాలోని ఏ రాష్ట్రం అయినా.. సినిమా వాళ్లంటే క్రేజ్ సర్వత్రా ఉంటుంది. వారేం చేసినా అది పెద్ద విశేషంగా, విచిత్రంగా తోస్తూ ఉంటుంది.
ఇక తారల పర్సనల్ ఎఫైర్స్, వారు ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం.. పెద్ద ఉత్సవాలు అయిపోతూ ఉంటాయి మీడియాలో. పెళ్లిళ్లకు సంబంధించి లైవ్ అప్ డేట్స్ ఇవ్వడం ఈ రోజుల్లో మీడియాకు పెద్ద డ్యూటీ అయిపోయింది. ఎవరిదైనా సెలబ్రిటీల పెళ్లి అంటే.. ఆ పెళ్లికి రెండు రోజుల ముందు నుంచి నిమిష నిముషం ఏదో ఒక అప్ డేట్ తో పేరున్న మీడియా సంస్థలన్నీ తమ వెబ్ సైట్లలో లైవ్ పేజెస్ ను నడుపుతూ ఉంటాయి.
సమంత నాగచైతన్య, విరాట్ కొహ్లీ అనుష్కా శర్మ, కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ వంటి వారి పెళ్లిళ్లపై వెబ్ లో జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు! ఈ క్రమంలోనే అలియా భట్ రణ్ భీర్ కపూర్ ల పెళ్లిపై కూడా బోలెడంత హడావుడి జరిగింది.
వీటిని వీక్షించే వారు వీక్షిస్తూ ఉంటారు. లైట్ తీసుకునే వారు లైట్ తీసుకుంటూ ఉంటారు. అయితే వెబ్ మీడియాలో అంత హడావుడి జరుగుతోందంటే.. వీటిపై ప్రేక్షకుల్లో ఆసక్తి మంచి స్థాయిలో ఉందనే దాని అర్థం అనుకోవాలి! వ్యూస్ ను పరిగణనలోకి తీసుకునే వెబ్ సైట్లలో కవరేజీ ఉంటుందనేది సాధారణంగా అర్థం చేసుకోదగిన అంశం. ఇలాంటి పెళ్లిళ్ల గురించి లైవ్ అప్ డేట్స్ తో లైవ్ పేజీలు నడుస్తున్నాయంటే.. వాటికి ఆదరణ లభిస్తున్నట్టే!
ఆ సంగతలా ఉంటే.. బాలీవుడ్ లో ఇన్నేళ్లూ ప్రేమ అంటే, ఫలానా హీరో, హీరోయిన్లు ప్రేమలో ఉన్నారంటే.. అదొక టైమ్ పాస్ వ్యవహారం వాళ్లకు అన్నట్టుగా అంతా అనుకునే వారు. హీరోలు, హీరోయిన్లు కొన్నేళ్ల పాటు ఏదో ఒక ప్రేమ వ్యవహారాన్ని నడపడం, ఆ తర్వాత బ్రేకప్ అనడం వంటి ఫలితంగా వారు ప్రేమలో ఉన్నారంటేనే.. దాన్నో టైమ్ పాస్ వ్యవహారం గా చూసే వారంతా. అయితే ఇప్పుడు ప్రముఖ తారలే తమ ప్రేమను పెళ్లి దిశగా తీసుకెళ్లడం వల్ల.. అక్కడ ప్రేమ సీరియస్ గా మారినట్టుగా అనిపిస్తోంది.
పదేళ్ల కిందటి వరకూ కూడా… ప్రేమ ఆ వెంటనే బ్రేకప్ అనే తరహా కథలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు ప్రేమకు కొనసాగింపుగా పెళ్లి భాజాలు కూడా బాలీవుడ్ నుంచి మోగుతున్నాయి. తాము ప్రేమించిన వాడిని బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా, కత్రినా, కరీనా, అనుష్కా శర్మ, అలియా… ఈ జాబితాలో ఇటీవల చోటు సంపాదించుకున్న వారు.
ఇదే సమయంలో కొన్ని జంటలు విడాకుల బాట కూడా పట్టాయి. హృతిక్, ఆమిర్ ఖాన్ వంటి హీరోలు తమ వైవాహిక బంధాలను తెంచేసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి బాలీవుడ్ ప్రేమ కథల సక్సెస్ రేటు పెరిగినట్టుగా అగుపిస్తోంది.