ఇటీవల కొంతమంది హీరోయిన్లు కండోమ్ యాడ్స్ ను తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్టు చేయడం, మరి కొందరు డైరెక్టుగా తామే వాటిని ప్రమోట్ చేయడం, సదరు కండోమ్ ల వల్ల శృంగారంలో సుఖం మరింతగా ఉంటుందన్నట్టుగా చెప్పడం… ఇవన్నీ జరిగాయి. వీటిని కొందరు అభ్యంతకరంగా భావించారు. సదరు నటీమణులను ట్రోల్ చేశారు.
అయితే నటీమణులు వాటిని లైట్ తీసుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియా విస్తృతం అయ్యాకా.. ట్రోల్ కు గురి కాని అంశాలు అంటూ ఏమీ లేవు. కాబట్టి.. హీరోయిన్లు కండోమ్ లను ప్రమోట్ చేయడాన్ని కూడా కొంతమంది సహజంగానే ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ సంగతి పక్కన పెడితే.. కండోమ్ ల ప్రమోషన్ తప్పా? రైటా? అనే అంశంపై కూడా జడ్జిమెంట్ జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కూడా కొన్ని నియమాలను పెట్టినట్టుగా ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది.. ప్రైమ్ టైమ్ లోనూ, పగలూ.. టెలివిజన్లలో కండోమ్ యాడ్స్ ప్రసారం చేయకూడదని రూలేదో ఉన్నట్టుగా ఉంది. రాత్రి పది తర్వాతే.. అలాంటి యాడ్స్ ను ప్రమోట్ చేయాలన్నట్టుగా ప్రభుత్వం నిర్దేశించినట్టుగా ఉంది. అయితే.. కండోమ్ యాడ్ లు సమాజానికి మరీ అంత ప్రమాదకరమా? అనేది ఈ నియామాలను, సోషల్ మీడియా ట్రోలింగ్ లనూ చూశాకా వచ్చే సందేహం!
ఇదే అంశంపై విశ్లేషిస్తే.. దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత ప్రభుత్వం స్వయంగా కండోమ్స్ గురించి యాడ్స్ చేయించింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ అథారిటీ వారు భారీ ఎత్తున కండోమ్స్ కు ప్రచారం కల్పించారు. సినిమా తారలతో పోస్టర్లను డిజైన్ చేయించి బస్టాండ్ లలో కూడా ఉంచారు. ప్రత్యేకించి వివాహితులు అయిన తారలే ఆ పోస్టర్లలో కనిపించారు. నాగార్జున అమల, జీవితా రాజశేఖర్ వంటి వారు ఆ పోస్టర్లలో కనిపించారు.
ఇక ఇప్పుడంటే ప్రైమ్ టైమ్ లో ఆ యాడ్స్ వద్దంటున్నారు కానీ, అప్పట్లో దూరదరర్శన్ లో సాయంత్రం అయితే ఇవే యాడ్సే కనిపించేవి. ఏడున్నర నుంచి ఎనిమిది మధ్యన దూరదర్శన్ హైదరాబాద్ లో తెలుగు ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఆ యాడ్స్ ను ఒక రేంజ్ లో ప్రసారం చేసే వారు. అప్పుడు ఎయిడ్స్ పై అవగాహన పెంచడం గురించి ఇలా ప్రయత్నాలు ఎన్నో జరిగాయి.
మరి ఇప్పుడేమో… కండోమ్ మళ్లీ ప్రస్తావనకు నిషేధితమైన అంశంగా మారినట్టుగా ఉంది. అన్ వాంటెడ్ ప్రెగ్నెన్సీ విషయంలో అయినా, హెచ్చరికగా అయినా.. కండోమ్ ల ప్రస్తావన అవసరమే అని ఒకప్పుడు ప్రభుత్వమే వాటికి విపరీతమైన ప్రచారం చేయించింది. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి, డబ్బు కోసమే అయినా సినిమా వాళ్లు సోషల్ మీడియా ద్వారా వాటిని ప్రచారం లోకి తీసుకు వస్తే ట్రోలింగ్ జరుగుతూ ఉంది.