లాక్‌డౌన్ కారణంగా బుల్లితెర, వెండితెర ఆర్టిస్టుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. ఆర్టిస్టులు రెమ్యునరేషన్ తగ్గించుకుంటే తప్ప గ్లామర్ రంగం కోలుకోలేని పరిస్థితి. ఆ మధ్య ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ హీరోహీరోయిన్లు, దర్శకులు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే చిత్ర పరిశ్రమకు మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే చిత్ర నిర్మాణ ఖర్చులు కూడా బాగా తగ్గించుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.
ఇదిలా ఉంటే ప్రముఖ తెలుగు యాంకర్లు కూడా తమ రెమ్యునరేషన్‌ను సగానికి సగం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ యాంకర్ సుమ రెమ్యునరేషన్ సగానికి సగం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ ఎపిసోడ్‌కు సుమ రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు.
ప్రస్తుతం లాక్‌డౌన్ ఆర్థిక కష్టాలను దృష్టిలో పెట్టుకుని రూ.లక్ష తీసుకుంటూ నిర్మాతకు సుమ అండగా నిలిచినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే అనసూయ, రష్మీ కూడా సుమ బాటలో ప్రయాణిస్తున్నారని సమాచారం. జబర్దస్త్ షోలో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునే వీరు కూడా నిర్మాతల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ముందుకొచ్చారనే టాక్ నడుస్తోంది.
వీరితో పాటు బిగ్‌బాస్ సెలబ్రిటీ, బుల్లితెర రాములమ్మగా లేడీ అమితాబ్ విజయశాంతితో పిలుపించుకున్న శ్రీముఖి, మంజుషలు కూడా తమ రెమ్యునరేషన్ల విషయంలో పట్టుదలకు పోనట్టు తెలిసింది. మొత్తానికి రెమ్యునరేషన్ తగ్గించుకోకపోతే అస లుకే ఎసరు వచ్చే పరిస్థితి ఉండడంతో…అంతా కరోనా మహత్యం అనుకుంటూ వచ్చినంత చాలులే అని సరిపెట్టు కుంటున్నారు. కొందరు యాంకర్లు సొంతంగా యూ ట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. దీని ద్వారా రెమ్యునరేషన్‌లో వచ్చిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.