సాధారణంగా ఏ హీరో లిస్ట్ లోనైనా ఒకట్రెండు సినిమాలు పెండింగ్ లో ఉంటాయి. ఓ సినిమా పూర్తయిన వెంటనే పెండింగ్ లో ఉన్న మరో సినిమాను పట్టాలపైకి తెస్తుంటారు. అయితే సునీల్ లిస్ట్ లో మాత్రం ఏకంగా 10వేల సినిమాలు పెండింగ్ లో ఉన్నాయట. అయితే అవి చేయాల్సిన సినిమాలు కావు, చూడాల్సిన సినిమాలు.
“నా ఇంట్లో 12వేల సీడీలున్నాయి. అన్నీ ఒరిజినల్స్. సినిమా సీడీలు కలెక్ట్ చేయడం నాకిష్టం. ఏ దేశం వెళ్లినా సీడీలు కొనుక్కుంటాను. వరల్డ్ సినిమా గురించి తెలుసుకోవడం, మన ముందు తరాలు చేసిన నటన చూడడం నాకిష్టం. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమా సీడీలు కొంటుంటాను. అయితే వాటిలోంచి ఇప్పటివరకు ఓ 2 వేల సినిమాలు మాత్రమే చూశాను. కరోనా టైమ్ లో చాలా సీడీలు కవర్ చేశాను. రోజుకొక సినిమా చూశాను.”
తన దగ్గరున్న సినిమాల కలెక్షన్ మొత్తం చూడ్డానికి జీవిత కాలం సరిపోదంటున్నాడు సునీల్. పైగా చాలామంది గ్రేట్ ఆర్టిస్టులు ఇప్పటికే ఎన్నో రకాలు చేశారని, అవి చూసి ఎంజాయ్ చేయాలంటున్నాడు.
“మనం ఇప్పుడేదో చేసేస్తున్నాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మన పెద్దోళ్లు అన్నీ చేసేశారు. కామెడీ, యాక్షన్ లో వాళ్లు చూపించని వేరియేషన్ లేదు. వాళ్లు మొత్తం పిండేసి ఆ క్లాత్ ఆరేస్తే.. మళ్లీ మనం ఆ క్లాత్ తీసి ఉతుక్కుంటున్నాం అంతే.”
రీసెంట్ గా ఎఫ్3 సినిమాలో నటించాడు సునీల్. మరోవైపు పుష్ప ఇచ్చిన ఇమేజ్ తో బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే మరోసారి హీరోగా కూడా నటించబోతున్నట్టు స్పష్టం చేశాడు.