ఎప్పుడూ విమర్శలేనా.. ఎజెండా ఎక్కడ బాబూ!

మహానాడు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూశారు తెలుగు తమ్ముళ్లు. కొత్త అజెండా ఉంటుందని, పాచిపోయిన, అరిగిపోయిన రికార్డులు పక్కనపెట్టి.. కొత్తగా ఏదైనా చెబుతారేమోనని ఆశపడ్డారు. కానీ చంద్రబాబు అదే పాత పాట పాడారు.…

మహానాడు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూశారు తెలుగు తమ్ముళ్లు. కొత్త అజెండా ఉంటుందని, పాచిపోయిన, అరిగిపోయిన రికార్డులు పక్కనపెట్టి.. కొత్తగా ఏదైనా చెబుతారేమోనని ఆశపడ్డారు. కానీ చంద్రబాబు అదే పాత పాట పాడారు. యువతరం రావాలి, యువతకు 40శాతం సీట్లిస్తామన్నారే కానీ.. ఎక్కడా మహానాడులో కొత్తదనం లేదు.

తమ్మినేని సీతారాం చెప్పినట్టు మహానాడు వల్లకాడులా సాగింది కానీ, నూతనత్వం కొంచెమైనా కనపడలేదు. దమ్ములేని చంద్రబాబు మరోసారి ఆరోపణలు, విమర్శలతోనే కాలక్షేపం చేశారు. తన ఎజెండా ఏంటి.. పార్టీ మేనిఫెస్టో ఏంటనేది ఒక్క ముక్క కూడా చెప్పలేదు. మహానాడులో బాబు ప్రసంగం విన్నవారెవరికైనా ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. 

2019కు ముందు సరిగ్గా ఎన్నికలకు రెండేళ్ల ముందు జగన్ జనంలోకి వెళ్లారు. కనివినీ ఎరుగని రీతిలో పాదయాత్ర చేశారు. ప్రజల మధ్యనే తన పార్టీ విధానాన్ని ఆవిష్కరించారు. అధికారికంగా మేనిఫెస్టో విడుదల చేయనప్పటికీ, అనధికారికంగా ఏం చేయబోతున్నామో చెప్పారు. 

ఇప్పుడు బాబు అదే పొజిషన్ లో ఉన్నారు. మహానాడు లాంటి వేదిక పైనుంచి ఆయన తన పార్టీ విధానాన్ని వివరిస్తే బాగుండేది. భవిష్యత్తులో విడుదలచేయబోతున్న మేనిఫెస్టో నుంచి 2-3 అంశాల్ని ప్రస్తావిస్తే బాగుండేది. కానీ అలాంటిదేం జరగలేదు. గతంలో జూమ్ మీటింగ్ లలో సెలవిచ్చే మాటలన్నీ ఇప్పుడు మళ్లీ రిపీట్ చేశారు. ఆ జూమ్ కే ఇప్పుడు మహానాడు అనే పేరుపెట్టారు.

మహానాడు ఎందుకు..? ఎవరి కోసం..?

పార్టీ తరపున కీలక నిర్ణయాలు యూట్యూబ్ లైవ్ లో చెబితే బాగుండదు, ప్రెస్ మీట్ పెట్టి వివరిస్తే సరిపోదు, అందుకే  టీడీపీకి మహానాడు అనే వేదిక ఉంది. పార్టీ కష్ట, నష్టాలను మాట్లాడుకోవడంతో పాటు, భవిష్యత్ కార్యాచరణ దిశగా అడుగులు వేయాలి. కానీ ఇక్కడ అదే కొరవడింది. 

ఎంతసేపు వైసీపీ పాలనకు వంక పెట్టడం మినహా.. కొత్తగా చంద్రబాబు ఏం చేస్తారనేది చెప్పలేకపోయారు. వీటికి తోడు అదనంగా ఈసారి బూతులు, తొడగొట్టడాలు కూడానూ.

మళ్లీ నువ్వే రావాలి.. వచ్చి ఏం చేయాలి..?

మళ్లీ నువ్వే రావాలి బాబూ అంటూ మహానాడులో హంగామా సృష్టించారు. వస్తారు సరే, వచ్చి ఏం చేస్తారనేదే ఇప్పుడు పాయింట్. మళ్లీ చంద్రబాబు వచ్చి ఏం చేయాలి. 

పోలవరం పనుల్ని మధ్యలోనే ఆపేయాలా..? రుణమాఫీ చేయకుండా రైతుల్ని ముంచేయాలా..? నవరత్నాల్ని భూస్థాపితం చేయాలా..? అమరావతి పేరుతో కోట్లు దండుకుని, గ్రాఫిక్స్ చూపిస్తే చాలా..? నీరు-చెట్టుతో నిధులు బొక్కేయాలా..? జన్మభూమి కమిటీల పేరుతో అయినవారికి దోచిపెట్టాలా..? చంద్రబాబు మళ్లీ ఎందుకు రావాలి..? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు మహానాడులో సమాధానం లేదు.

అజెండా లేకుండా కేవలం విమర్శలకే పరిమితమైన మహానాడు నిజంగానే కార్యకర్తలకు విసుగు తెప్పించింది. పోనీ పార్టీకి ఏమైనా ఉపయోగపడిందా అంటే అదీ లేదు. బాబు సొల్లు వినడానికి వాహనాల్లో అందరూ ఒంగోలు దాకా రావాలా..? అదేదో యూట్యూబ్ లైవ్ ఇస్తే ప్రయాస లేకుండా వింటారు కదా..?

మొత్తమ్మీద మహానాడు ఫస్ట్ డేనే ఫ్లాప్ షో గా మిగిలింది. చెప్పాల్సింది చెప్పకుండా, చేయాల్సింది చేయకుండా బాబు టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని గందరగోళంలోకి నెట్టేశారు. సామాన్య ప్రజలకు క్వశ్చన్ మార్క్ గానే మిగిలారు.