ఇది సెంటిమెంట్ కాదు, అలా అని దీనికి లాజిక్ కూడా లేదు. జస్ట్ అలా జరుగుతోందంతే. చిరంజీవి సరసన ఏ హీరోయిన్ నటిస్తే ఆ హీరోయిన్ కు వెంటనే పెళ్లి అయిపోతోంది. మొన్నటికిమొన్న కాజల్, ఇప్పుడు నయనతార.
చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటించింది కాజల్. ఆ సినిమా సెట్స్ పై ఉంటుండగానే ఆమెకు పెళ్లయింది. ఆచార్య రిలీజ్ అయ్యే టైమ్ కు ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది కూడా. ఇప్పుడు నయనతార వంతు వచ్చింది.
చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార హీరోయిన్. ఇప్పుడీ హీరోయిన్ కూడా పెళ్లికి రెడీ అయిపోయింది. మరికొన్ని రోజుల్లో దర్శకుడు విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకోబోతోంది. దాదాపు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయన్-విఘ్నేష్. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.
చిరంజీవితో సినిమాకు కమిట్ అయిన టైమ్ లోనే నయన్-విఘ్నేష్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు గాడ్ ఫాదర్ సెట్స్ పై ఉంటుండగానే పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అలా కాజల్ టైపులో, నయనతార కూడా చిరంజీవి సినిమాతోనే వివాహ బంధంలోకి ఎంటర్ అవుతోంది.
ఇలా ఇద్దరు హీరోయిన్లకు జరగడంతో ఇప్పుడు అందరి చూపు తమన్నాపై పడింది. ఎందుకంటే, ఈ ముద్దుగుమ్మ కూడా చిరంజీవి సరసన నటిస్తోంది. భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి హీరోయిన్ తమన్నానే. దీంతో ఆ సినిమా కంప్లీట్ అయ్యేలోపు తమన్న కూడా పెళ్లి చేసుకుంటుందేమో అనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మిల్కీబ్యూటీ వయసు 32 సంవత్సరాలు.