“బాగా చదుకుకోవాలి, లేదంటే గాడిదలు కాచుకోవడం తప్ప మరే పని దొరకదు.” పెద్దోళ్లు తమ పిల్లలకు తరచుగా చెప్పే మాట ఇది. కానీ దీన్ని రివర్స్ లో చేసి చూపించాడు ఓ వ్యక్తి. చదువుకున్నాడు కానీ గాడిదలు కాస్తున్నాడు. అలా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. తమిళనాడుకు చెందిన బాబు కథ ఇది.
తిరునల్వేలి జిల్లా వానార్ పేటకు చెందిన బాబుకు రెగ్యులర్ ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. చాలా ఆలోచించిన తర్వాత అతడికి గాడిద పాలతో బిజినెస్ చేయాలని అనిపించింది. దీనికి సంబంధించి అతడు రీసెర్చ్ చేశాడు. మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాడు. విరుదాచలంలో 10 మిల్లీలీటర్ల గాడిద పాలను 50రూపాయలకు అమ్ముతున్నట్టు తెలుసుకున్నాడు.
తమిళనాడులో గాడిదలు తక్కువ. ఆడ గాడిదలు మరీ తక్కువ. ఉన్నవి కూడా రోజుకు 350 మిల్లీలీటర్ల పాలు మాత్రమే ఇస్తాయి. కానీ బెంగళూరులోని ఓ కాస్మొటిక్ సంస్థకు నెలకు వెయ్యి లీటర్ల పాలు అవసరమని తెలుసుకున్నాడు. వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కొంత పొలం అమ్మేసి 100 గాడిదలు కొన్నాడు. వీటితో దేశవాలీ గాడిదలతో పాటు.. రోజుకు లీటరు పాలిచ్చే గుజరాతీ గాడిదల్ని కూడా కొన్నాడు. వాటిని చూసుకునేందుకు ఓ కుటుంబాన్ని పెట్టాడు. మిగిలిన పొలంలో కేవలం గాడిదలు తినడానికి మంచి గడ్డి, తృణధాన్యాలు పండించాడు.
అలా లీటరు 7వేల రూపాయలు సంపాదిస్తున్నాడు బాబు. యూరోప్ దేశాల్లో గాడిద పాలకు మంచి డిమాండ్ ఉందని తెలుసుకున్న బాబు, ఇప్పుడు ఆ దిశగా ఆలోచన చేస్తున్నాడు. యూరోప్ కు గాడిద పాలను ఎగుమతి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు.