కరోనా వైరస్ విధ్వంసం మామూలుగా లేదు. అసలు భవిష్యత్‌లో సినిమాలు నిర్మిస్తామా? లేదా? అనే భయాందోళనలు ఓ అగ్ర నిర్మాతలో కలిగించేంతగా కరోనా విలయతాండవం చేస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ ఎంత పెద్ద నిర్మాణ సంస్థో అందరికీ తెలుసు. ఆ నిర్మాత సంస్థ అధినేత డి.సురేష్‌బాబు ఆన్లైన్లో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కొత్త సినిమాల నిర్మాణంపై ఆయన మాటల్లో నిర్వేదాన్ని చూడొచ్చు.
రానా పెళ్లి పనులపై ఆయన మాట్లాడుతూ ప్రతిదాన్ని కరోనాకు ముందు, తర్వాత అని ప్రస్తావించాల్సి ఉంటుందన్నారు. కరోనాకు ముందు పెళ్లంటే ఎంతో హడావుడి ఉండేదన్నారు. పెళ్లికి ఎంత మందిని, ఎవరెవరిని పిలవాలో ముందే అన్నీ చర్చించుకోవాల్సి వచ్చేదన్నారు. దాన్ని బట్టి పెళ్లికార్డులు పంచేవాళ్లన్నారు. అయితే ప్రస్తుత కరోనా కాలంలో ఏం చేసినా జాగ్రత్తలు తీసుకోక తప్పనిసరి పరిస్థితులు వచ్చాయన్నారు.
లాక్డౌన్ నిబంధనలు అనుసరించి పరిమిత సంఖ్యలో చాలా దగ్గరి వాళ్ల మధ్య పెళ్లి జరుపుకోవాల్సి వచ్చిందన్నారు. అందువల్ల రానా పెళ్లికి సంబంధించి పెద్దగా హడావుడి ఉండదన్నారు. అందువల్ల చిన్నచిన్న పెళ్లి పనులే జరుగుతున్నట్టు సురేష్‌బాబు చెప్పుకొచ్చారు.
రెండో తనయుడు అభిరామ్ వెండితెర ప్రవేశంపై సురేష్‌బాబు స్పందించారు. అభిరామ్ ప్రవేశం ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేనన్నారు. కానీ అతని కోసం కొన్ని కథలు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
భవిష్యత్‌లో సురేష్‌బాబును దర్శకుడిగా చూసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు…ఆయన ఎంతో ఆసక్తికర, ఆశ్చర్యపోయే విషయాలు చెప్పారు. అసలు ఈ కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడుతామో తెలియని అయోమయ పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్ని చూస్తుంటే భవిష్యత్‌లో అసలు సినిమాలు నిర్మిస్తామో? లేదో? అనే భయాందోళనలు కలుగుతున్నాయన్నారు. ఇక దర్శకత్వం వహించే పరిస్థితి, ఆలోచన ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.
కరోనా మహమ్మారి ఎప్పుడు అదుపులోకి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈ మహమ్మారి నుంచి బయట పడే వరకు ఒక్క సినిమా రంగమే కాదు…ప్రతి పరిశ్రమకు ఇబ్బందులు తప్పవని ఆయన చెప్పుకొచ్చారు.