సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ మరో రీమేక్ ఫైనలైజ్ చేసింది. మొన్నటికిమొన్న సమంతతో ఓ బేబీ అనే రీమేక్ చేసిన సురేష్ బాబు.. ఈసారి కాజల్ తో మరో రీమేక్ ఫిక్స్ చేశారు. ఈ రెండూ కొరియన్ సినిమాలకు రీమేక్స్ కావడం విశేషం.
8 ఏళ్ల కిందట వచ్చిన కొరియన్ సినిమా డాన్సింగ్ క్వీన్ ను తెలుగులో తీయడానికి రెడీ అవుతున్నాడు సురేష్ బాబు. ఈ మేరకు ఆ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్న ఈ నిర్మాత.. కాజల్ హీరోయిన్ గా ఆ సినిమాను స్టార్ట్ చేస్తామని అఫీషియల్ గా ప్రకటించారు. మరో కీలక పాత్రలో అల్లరి నరేష్ నటించే అవకాశం ఉంది.
తను ఏ సినిమా చేసినా దానికి మరో నిర్మాణ భాగస్వామిని పెట్టుకోవడం సురేష్ బాబుకు అలవాటు. డాన్సింగ్ క్వీన్ రీమేక్ కూడా సురేష్ బాబు కో-ప్రొడక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరో నిర్మాతను కాకుండా.. ఈసారి ఓ బడా నిర్మాణ సంస్థను తనతో కలుపుకోవాలని చూస్తున్నారు. ఈ మేరకు ఆయన కొన్ని కార్పొరేట్ సంస్థలతో చర్చలు కూడా ప్రారంభించారు.
జీ స్టూడియోస్, వయకామ్, రిలయన్స్ లాంటి బడా సంస్థల్లో ఏదో ఒకటి ముందుకొచ్చిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారు. మరోవైపు ఈ రీమేక్ ప్రాజెక్టు దర్శకత్వ బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలనే అంశంపై కూడా సురేష్ బాబు కసరత్తు ప్రారంభించారు. ఓ బేబీ తీసిన నందినీరెడ్డి కూడా ఈ లిస్ట్ లో ఉంది. నిర్మాణ భాగస్వామి ఎవరనే విషయం తేలిన వెంటనే అన్ని డీటెయిల్స్ బయటకొస్తాయి.