తమిళ అనువాద సినిమాలకు రెండు దశాబ్దాల కిందట తెలుగులో విపరీతమైన ఆదరణను పెంపొందించిన సినిమాల్లో ఒకటి శివపుత్రుడు. తమిళంలో పితామగన్ పేరిట రూపొందిన ఈ సినిమా తెలుగునాట సీడీల రూపంలో తమిళ వెర్షన్లోనే బ్రహ్మాండమైన ఆదరణను పొందింది ఆ రోజుల్లో.
ఆ తర్వాత దీన్ని తెలుగులోకి అనువదించారు. ఆ సినిమాతో సూర్యకు తెలుగునాట మంచి గుర్తింపు దక్కింది. అక్కడ నుంచి అతడి సినిమాలు ఒక్కొక్కటిగా తెలుగులోకి అనువాదం కావడం, అలా వచ్చిన వాటిల్లో గజిని సూపర్ హిట్ కావడంతో.. సూర్యకు తెలుగునాట స్టాండర్డ్ మార్కెట్ లభించింది.
కేవలం తెలుగునాటే కాదు.. తమిళంలో కూడా సూర్యకు పితామగన్ ప్రత్యేకమైన సినిమానే. దీంతో పాటు నందా అనే మరో సినిమా కూడా సూర్యకు అవసరమైన విజయాన్ని ఇచ్చింది. ఈ రెండు సినిమాల దర్శకుడెవరో వేరే చెప్పనక్కర్లేదు.
అతడే సంచలన దర్శకుడు బాల. నందా, పితామగన్ సినిమాలతో సూర్య కెరీర్ ను సెటిల్ చేసిన బాల దర్శకత్వంలో సూర్య మళ్లీ ఫుల్ లెంగ్త్ సినిమాలేవీ చేయలేదు. తనదైన ధోరణిలో బాల సినిమాలు చేస్తూ వెళ్లగా, సూర్య మాస్ రూటు పట్టారు. అయితే అడపాదడపా వైవిధ్యతకు ప్రాధాన్యతను ఇవ్వడాన్ని సూర్య మరవలేదు.
ఇలాంటి క్రమంలో మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతోంది. బాల దర్శకత్వంలో తన తదుపరి సినిమా ఉంటుందని సూర్య ప్రకటించాడు. ఇలా రెండు దశాబ్దాల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. పితామగన్ లో సూర్య కన్నా విక్రమ్ హైలెట్ అయ్యాడు.
ఇక తమిళంలో నందా పేరుతో రూపొందిన సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది కానీ, ఆ క్లైమాక్స్ తెలుగు వాళ్లకు ఎక్కలేదు. పెద్దగా ప్రచారం కూడా లేకపోవడంతో ఆ సినిమా గుర్తింపుకు నోచుకోలేదు తెలుగునాట. మరి ఈ సారి ఈ ద్వయం ఎలాంటి సబ్జెక్ట్ తో వస్తారో!