ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 3 వారాలకు పైగా రిమాండ్ లో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. బాంబే హైకోర్టు ఆర్యన్…

ముంబయి క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి 3 వారాలకు పైగా రిమాండ్ లో ఉన్న షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. బాంబే హైకోర్టు ఆర్యన్ ఖాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈరోజు లేదా రేపు ఆర్యన్ ఖాన్ బెయిల్ పై విడుదలై తన నివాసానికి చేరుకుంటాడు.

నిజానికి అరెస్ట్ అయిన వెంటనే ఆర్యన్ ఖాన్ కు బెయిల్ వస్తుందని అంతా భావించారు. ఎందుకంటే, అరెస్ట్ చేసిన సమయంలో ఆర్యన్ వద్ద ఎలాంటి మాదకద్రవ్యాలు పట్టుబడలేదని స్వయంగా ఎన్సీబీ అధికారులే వెల్లడించారు. దీంతో వెంటనే బెయిల్ కు అప్లయ్ చేశారు. కానీ ఆర్యన్ బయటకొస్తే సాక్ష్యుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపిన కోర్టు.. అదే టైమ్ లో ఆర్యన్ మొబైల్ ను పరిశీలించాలని కోరడంతో బెయిల్ దొరకలేదు.

గత వారం ఆర్యన్ కు కచ్చితంగా బెయిల్ వస్తుందని అంతా భవించారు. కానీ సరిగ్గా కోర్టు తీర్పుకు గంట ముందు ఎన్సీబీ కౌంటర్ వేసింది. ఆర్యన్ మొబైల్ ఛాటింగ్స్ లో డ్రగ్స్ ప్రస్తావన ఉందని ఆ కౌంటర్ లో పేర్కొంది. దీంతో ఆర్యన్ బెయిల్ మరింత ఆలస్యమైంది. ఈ క్రమంలో షారూక్ నివాసంతో పాటు.. ఆర్యన్ ఛాటింగ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అనన్య పాండే నివాసంలో కూడా సోదాలు జరిగాయి. అనన్యను 3 సార్లు విచారించారు కూడా.

అయితే ఇన్ని రోజులైనా ఆర్యన్ కు వ్యతిరేకంగా సరైన ఆధారాలు సేకరించలేకపోయింది ఎన్సీబీ. పైగా ఆర్యన్ ను మరోసారి రిమాండ్ కోరడానికి బలమైన కారణాలు చూపించలేకపోయింది. దీంతో ఆర్యన్ ఖాన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఆదేశాలిచ్చింది.