ఎన్సీబీ ముంబై జోనల్ ఆఫీసర్ సమీర్ వాంఖడేకు అరెస్టు భయం తీవ్రంగా మారినట్టుగా ఉంది. తనపై వచ్చిన ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసుల విచారణ నేపథ్యంలో.. ఆయన తన అరెస్టును ఆపడానికి కోర్టును ఆశ్రయించారు.
తనను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయకుండా నిరోధించాలని కోరుతూ ఆయన కోర్టులో వేసిన పిటిషన్ కూడా తిరస్కరణకు గురి కావడం గమనార్హం. ఆయన పిటిషన్ ను తిరస్కరించింది న్యాయస్థానం.
అయితే వాంఖడేకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక హామీ ఇచ్చారు. వాంఖడేను పోలీసులు అరెస్టు చేసే పరిస్థితి వస్తే కనీసం 72 గంటల ముందు నోటీసులు ఇస్తారని ఆయన కోర్టుకు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ మేరకు చెప్పడంతో వాంఖడే పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. ఆయన అరెస్టును నిరోధిస్తూ ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వలేదు.
మరోవైపు తనపై వస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసుల విచారణను వాంఖడే వద్దంటున్నాడు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణను కేవలం సీబీఐ అధికారులే చేపట్టాలని కూడా కోరుతున్నాడు. ఈ మేరకు ఆయన కోర్టుకు విన్నవించుకున్నాడు.
ఇలా ఒక ప్రభుత్వాధికారి ఒక రాష్ట్ర పోలీసులను నమ్మకపోవడం గమనార్హం. తనపై విచారణ కేవలం సీబీఐ మాత్రమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి వీళ్లు అరెస్టులు చేసేటప్పుడు మాత్రం అధికారులు బెయిల్ ల విషయంలో రకరకాల అభ్యంతరాలను చెబుతూ ఉంటారు.
కేసులను ఎదుర్కొంటున్న వారు కోర్టుల్లో వినిపించే వాదనలపై అభ్యంతరాలను వినిపిస్తూ ఉంటాడు. వాంఖడే డబ్బులు డిమాండ్ చేశాడా.. లేదా అనేది వేరే సంగతి కానీ, తనపై విచారణ సీబీఐ మాత్రమే నిర్వహించాలంటూ ఒక అధికారి డిమాండ్ చేయడం విచిత్రమైన అంశమే.
కేంద్రంపై ఉన్న నమ్మకం మహారాష్ట్రపై లేదనుకోవాలా! ఎవరో రాజకీయ నేత ఇలా మాట్లాడితే ఒక లెక్క. అయితే ఒక ప్రభుత్వాధికారి ఇలాంటి అభ్యంతరాలను లేవనెత్తడం వెనుక కథేంటో!