తెలుగులో పొన్నియన్ సెల్వన్ ఫ్రాంచైజీ ఏ రేంజ్ లో అడిందో అందరికీ తెలుసు. పీఎస్-1 ఫ్లాప్ అవ్వగా, పీఎస్-2 ఫర్వాలేదనిపించుకుంది. ఇలాంటి సినిమాను 399 రూపాయలు పెట్టి తెలుగులో ఎవరైనా చూస్తారా? అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మాత్రం ఈ సాహసం చేసింది.
పొన్నియన్ సెల్వన్-2 సినిమాను స్ట్రీమింగ్ కు పెట్టింది ప్రైమ్ వీడియోస్. విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి తీసుకొచ్చిన ఈ సినిమాకు రెంట్ ఫిక్స్ చేసింది. ఈ సినిమాను చూడాలనుకుంటే, ఎవరైనా 399 రూపాయలు పెట్టాల్సింది. ఈ విషయంలో ప్రైమ్ మెంబర్స్ కు కూడా మినహాయింపు ఇవ్వలేదు ఈ సంస్థ.
థియేటర్లలోనే 200 రూపాయలు పెట్టి ఈ సినిమాను చూడ్డానికి ఇష్టపడలేదు ప్రేక్షకులు. అలాంటిది ఓటీటీలో 399 రూపాయలు ఎందుకు పెడతారనేది ప్రశ్న. పైగా ఓటీటీ కంటెంట్ మొత్తం క్షణాల్లో పైరసీ అవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో పొన్నియన్ సెల్వన్-2 లాంటి యావరేజ్ సినిమా కోసం 399 రూపాయలు ఎవరు పెడతారు?
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టు ఇది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష లాంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా కేవలం తమిళనాట మాత్రమే సక్సెస్ అయింది. అమెజాన్ కు ఏమైనా 'అద్దె డబ్బులు' వస్తే తమిళనాడు నుంచే రావాలి తప్ప, తెలుగు, మలయాళ, కన్నడ ప్రేక్షకుల నుంచి పెద్దగా రావనేది బహిరంగ రహస్యం.
మరోవైపు ఈ సినిమా ఫ్రీ స్ట్రీమింగ్ పై కూడా లీకులు వచ్చాయి. జూన్ 2 నుంచి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చందాదారులంతా ఉచితంగా చూడొచ్చు. సో.. ఈ వారం రోజుల్లో ఎంతమంది 399 రూపాయలు పెట్టి ఈ సినిమాను చూస్తారో!