జనసేనను రాజకీయ పార్టీగా బలపరచుకోండయ్యా అంటే, ఆ పనిని అన్నదమ్ములైన నాగబాబు, పవన్‌కల్యాణ్ మానేశారనే విమర్శలున్నాయి. జనసేన స్థాపించిన పదేళ్లు అవుతున్నా, ఇప్పటికీ ఆ పార్టీ నిర్మాణాన్ని నోచుకోలేదు. ఇటీవల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబును పవన్‌కల్యాణ్ నియమించారు. ఈ నియామకం వెనుక పార్టీ ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయనే ప్రచారం జరిగింది.
జనసేన పేరుతో కొంత మంది నాయకులు తమ ఇష్టానుసారం విదేశాలకు వెళ్లి భారీ మొత్తంలో నిధులను సేకరించినట్టు పవన్ దృష్టికి వెళ్లింది. దీంతో పవన్‌కల్యాణ్ అప్రమత్తమయ్యారు. తన అన్న నాగబాబుకు కీలక బాధ్యతలు అప్పగిస్తే, సేకరించిన సొమ్మంతా పార్టీకే చేరుతుందని భావించారు. దీంతో నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది.
ఈ నేపథ్యంలో తక్కువ సమయంలోనే మరోసారి నాగబాబు దుబాయ్ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్‌కి నాగబాబు చేరుకున్నారు. ఈ నెల 26 నుంచి 28వ తేదీ వరకూ దుబాయ్‌లో నిర్వహించే జనసేన సమావేశాలకు యూఏఈ, కువైట్, సౌదీ అరేబియా తదితర దేశాల్లోని జనసేన కార్యకర్తలు, వీర మహిళలు హాజరవుతారని ప్రకటన వెలువడింది.
విరాళాల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాలని జనసేన నాయకులు చెబుతున్నారు. జనసేనాని పవన్‌పై కులంతో పాటు సినిమాలపరంగా అభిమానించే వాళ్లు విదేశాల్లో ఉన్నారు. వాళ్ల అభిమానాన్ని రాజకీయంగా సొమ్ము చేసుకునేందుకు నాగబాబు దుబాయ్ పర్యటనకు వెళ్లినట్టు చర్చ జరుగుతోంది.
రాబోయే ఎన్నికల్లో ఖర్చు పెడితే తప్ప, కొన్ని సీట్లలో అయినా గెలవలేమని జనసేన నాయకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే పార్టీని బలోపేతం పక్కన పెట్టి, ఆర్థిక వనరులను సమీకరించుకోవడంలో తలమునకలవుతున్నారు.