బందోబస్త్ సినిమా విడుదలకు సిద్ధమైంది. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాలో ఆర్య ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. అయితే లెక్క ప్రకారం ఆ పాత్రను అల్లు శిరీష్ చేయాలి. కానీ కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేయలేక తను బందోబస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు గతంలో ప్రకటించుకున్నాడు శిరీష్. ఇప్పుడా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి శిరీష్ తప్పుకునే అంశంపై స్వయంగా సూర్య స్పందించాల్సి వచ్చింది. కానీ ఏం చెప్పాలో అర్థంకాక చాలా తికమకపడ్డాడు సూర్య.
బందోబస్త్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన సూర్య, అల్లు శిరీష్ తప్పుకున్న అంశంపై సూటిగా స్పందించలేకపోయాడు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి చాలా ఇబ్బందిపడ్డాడు. కొన్ని పేపర్ ఇష్యూస్ వల్ల, ఆఖరి నిమిషంలో మార్పుచేర్పుల వల్ల శిరీష్ ఈ సినిమా చేయలేకపోయాడని మాత్రమే స్పందించాడు సూర్య. పైగా మరికొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయని చెప్పుకొచ్చాడు.
అల్లు శిరీష్ గతంలో చెప్పినట్టు కాల్షీట్ల సమస్య వల్లనే ఈ సినిమాలో అతడు నటించలేకపోయాడని సూర్య చెబితే సరిపోయేదు. కానీ పేపర్ ఇష్యూస్, ఆఖరి నిమిషంలో మార్పుచేర్పులు అంటూ ఏదేదో మాట్లాడి ఇబ్బందిపడ్డాడు. నిజానికి ఈ ప్రాజెక్ట్ నుంచి శిరీష్ తప్పుకోలేదు. యూనిట్ సభ్యులే అతడ్ని తప్పించారని టాక్. నిజానికి ఆ టైమ్ లో శిరీష్ ఏమంత బిజీగా కూడా లేడు.
బందోబస్త్ సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటించింది. ఆమె రికమండేషన్ తోనే ఆర్యను ఈ ప్రాజెక్టులోకి తీసుకున్నారట. దీంతో అల్లు శిరీష్ తప్పుకోవాల్సి వచ్చిందనేది ఇన్ సైడ్ టాక్. మరో 5 రోజుల్లో థియేటర్లలోకి వస్తోంది బందోబస్త్ మూవీ.