సేవ్ నల్లమల.. అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్దయుద్ధమే జరుగుతోందని చెప్పొచ్చేమో. కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'చావ్ నల్లమల' అనే విధానానికే కట్టుబడి వున్నట్లు కన్పిస్తోంది. కేంద్రం నల్లమలలో యురేనియం నిక్షేపాలపై ఖచ్చితమైన అంచనాలతో వుంది. ఆ యురేనియంని వెలికి తీసేందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అంచనా వేయడం, అన్వేషించడం.. తవ్వకాలు జరపడం.. ఇవీ మూడుదశలు.
మొదటిదశ అంచనా వేయడం. దీంతో పెద్దగా సమస్యలేదు. రెండోదశ అన్వేషణ. నిజానికి ఇక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది.
మూడోదశ వెలికి తీత అత్యంత ప్రమాదకరం. వెలికి తీసిన ఖనిజాన్ని శుద్ధిచేయడం అనేది మరోదశ. ఈ దశలో తలెత్తే ప్రమాదం అంతా ఇంతా కాదు. యురేనియంని శుద్ధిచేసి, అత్యంత కీలకమైన రంగాల్లో వినియోగించడం కోసం కాకపోతే, అంచనాలెందుకు వేస్తారు.? అన్వేషణ ఎందుకు చేస్తారు.? తవ్వకాలు ఎందుకు చేపడ్తారు.? ఒకదానితో ఒకటి లింక్ అయిన దశలు ఇవి. ఒక దశలోనే ఈ పని ఆగిపోతుందని అనుకోవడానికి వీల్లేదు.
తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అత్యంత నాటకీయంగా, చట్టసభల్లో ప్రకటన చేసేశారు.. యురేనియం తవ్వకాలకు అనుమతినివ్వలేదని. అసెంబ్లీలోనూ, మండలిలోనూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని కూడా ప్రకటించేశారు చిత్రమేంటంటే, యురేనియం తవ్వకాలతోనే ప్రమాదం ఏర్పడుతుందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారనీ, శుద్ధిదశలో మాత్రమే ప్రమాదకరమనీ సెలవిచ్చారాయన.
యురేనియం ఓర్.. అంటే ముడి ఖనిజం దశలోనే ప్రమాదం అత్యంత తీవ్రస్థాయిలో వుంటుంది. లంగ్ క్యాన్సర్‌కి ఇది ప్రధాన కారకంగా అంతర్జాతీయ సమాజం ఎప్పుడో తీర్మానించేసింది. యురేనియం ఓర్ నుంచి వెలువడే ఓ రకమైన గ్యాస్, గాలిలో కలిసిపోయి, మనుషుల ఊపిరితిత్తుల్లోకి చేరి, క్యాన్సర్‌కి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడే కేటీఆర్, తన అసలు రంగు బయటపెట్టేసుకున్నారు. 'కేంద్రానిదే తప్పు.. బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు తవ్వేయడానికి ప్రయత్నిస్తోంది.
అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని మేమూ విమర్శించగలం.. కానీ, మేం రాజకీయం చేయదలచుకోవట్లేదు..' అని కేటీఆర్ చట్ట సభల వేదికగా పొలిటికల్ డైలాగులు బాగానే పేల్చారుగానీ.. యురేనియం అన్వేషణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రానికి ఎందుకు లేఖలు రాయలేదన్న ప్రశ్న ప్రజల నుంచి వెల్లువెత్తుతోంది.
ప్రజా సంఘాలు గళంవిప్పాయి.. ప్రజలు స్వచ్ఛందంగా నినదిస్తున్నారు.. సినీ సెలబ్రిటీలు సైతం ఈ ఉద్యమానికి మద్దతునిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేటీఆర్, తమ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నించారుగానీ.. యురేనియంకి వ్యతిరేకంగా ననిదించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?