అభిమానం వెర్రితలలు వేస్తోంది. ఒక చావు మరో చావును కోరుకుంటోంది. దీంతో ఒక నటికి డెత్ వార్నింగ్స్ ఇస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. ఈ ధోరణి బాలీవుడ్‌లో సంచలనం రేకెత్తిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తికి ఇలాంటి బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయి.
సుశాంత్ మృతి చెంది నెలరోజులైన సందర్భంగా అతనితో తన జ్ఞాపకాలను రియా గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో ఒక సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఆ పోస్ట్‌లో 'నువ్వు దూరమై నెలరోజులవుతోంది. అయినా నిన్ను నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను' అని తన ప్రేమను చాటుకుంటూ రాసుకొచ్చారు.
ఇలా రియా పోస్ట్ పెట్టడం కొందరు నెటిజన్లకు, సుశాంత్ అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు. సుశాంత్ ఆత్మహత్యకు రియా కూడా కారణమంటూ ఫైర్ అవుతున్నారు. చివరికి వారి ఆగ్రహం…ఆమెను చంపేయాలనే వరకు వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.
“నిన్ను కచ్చితంగా అత్యాచారం చేసి చంపేస్తాం. కాబట్టి నీ అంతట నువ్వే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమం. లేకపోతే మేమే నిన్ను చంపేస్తాం” అంటూ బెదిరిస్తూ మెసేజ్ చేశారు. ఈ మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను రియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
తన చావును కోరుతూ వార్నింగ్‌తో కూడిన మెసేజ్ ఇచ్చిన వాళ్లకు రియా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇంతకూ ఆమె ఎలా రియాక్ట్ అయ్యారంటే…”నన్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, సహించాను.. హంతకురాలని నిందించారు..భరించాను. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించే హక్కు మీకెక్కడిది? అది ఎంత పెద్ద నేరమో మీకైనా అర్థమ వుతోందా? ఇలాంటి దుర్మార్గమైన బెదిరింపులకు ఎవరూ పాల్పడవద్దు. ఇలాంటివి పునరావృతం కావద్దు. ఇక జరిగింది చాలు.. ఆపేయండి” అని పోస్ట్ చేశారు.
అలాగే తనపై బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. మొత్తానికి సుశాంత్ మృతి చెంది నెలరోజులు దాటినా…ఇంకా నిప్పు రాజేస్తూనే ఉంది. చివరికి అది ఏ టర్న్ తీసుకుంటుందో మరి!