మొన్నటికిమొన్న ఓ దుర్మార్గుడు.. హైదరాబాద్ లో 9వ తరగతి చదువుతున్న అమ్మాయి ఫొటోల్ని మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. సరిగ్గా ఇదే తరహా ఘటన ఈసారి గుంటూరులో రిపీట్ అయింది. ఇక్కడ మాత్రం పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు వ్యక్తిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.
నిజాంపట్నం మండలం పుర్లమెరక గ్రామానికి చెందిన రఘుబాబుకు గుంటూరులో సొంత ఐటీ కంపెనీ ఉంది. లాక్ డౌన్ టైమ్ లో కంపెనీ మూసేసి తన ఇంటికి వెళ్లిపోయిన రఘుబాబులో దుర్బుద్ధి పుట్టింది. నకిలీ వాట్సాప్, ఫేస్ బుక్ ఎకౌంట్లను సృష్టించాడు. తనతో పాటు చిన్నప్పుడు చదువుకున్న అమ్మాయిల ఫొటోల్ని సేకరించి, వాటిని మార్ఫింగా చేసి అశ్లీలంగా తయారుచేశాడు.
ఆ ఫొటోల్ని సదరు యువతులకు పంపించి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు రఘుబాబు. చెప్పినట్టు చేయకపోతే ఫొటోల్ని ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించాడు. కొందరు ధైర్యం చేసి ఆ నంబర్లను బ్లాక్ చేశారు. ఒక యువతి మాత్రం భయపడి చెప్పినట్టు చేసింది. దీంతో మరింత రెచ్చిపోయాడు రఘుబాబు. తనకు తెలిసిన మరింత మంది యువతుల్ని ఇదే పద్ధతిలో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు.
అయితే గుంటూరులోని నగరంపాలెంలో ఉంటున్న యువతి మాత్రం ధైర్యం చేసింది. నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు.. లేటెస్ట్ టెక్నాలజీతో రఘుబాబు ఎక్కడున్నాడో కనుక్కున్నారు. నిందుతుడ్ని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు.