చిత్ర పరిశ్రమ నిర్మాణ రంగంలోకి చిరంజీవి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా అడుగు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌చరణ్ నిర్మాత అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ఒక వైపు హీరోగా, మరో వైపు నిర్మాతగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న రామ్‌చరణ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సోదరుడి స్ఫూర్తి, తండ్రి ప్రోత్సాహంతో చిరు పెద్ద కుమార్తె కొణిదెల సుస్మిత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ముందడుగు వేశారు. నిర్మాణ సంస్థ స్థాపించడమే ఆలస్యం…ఆమె వెంటనే తన సంస్థ సారథ్యంలో వెబ్ సిరీస్‌ను కూడా స్టార్ట్ చేసి దూకుడు ప్రదర్శిస్తున్నారు.
సుస్మితకు చిత్ర పరిశ్రమ కొత్త కాదు. తన తండ్రి సినిమాలకు ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా సృజనాత్మక పాత్ర పోషించారు. ఇక సుస్మిత సోదరుడు రామ్‌చరణ్ విషయానికి వస్తే తన ఇంటి పేరుతోనే కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించాడు. సుదీర్ఘ విరామం తర్వాత సొంత నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలోనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి కథా నాయకుడిగా టాలీవుడ్‌లో రీఎంట్రీ చేయించాడు.
2017లో ఖైదీ నంబర్ 150 సినిమా చిరుకు 150వ చిత్రమే కాకుండా, రాజకీయాల నుంచి మళ్లీ సినిమాల్లోకి తీసుకొచ్చిన చిత్రంగా టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయింది. 2019లో సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పైనే తెరకెక్కించారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. వచ్చే ఏడాది చిరు 153వ చిత్రం కూడా ప్లానింగ్‌లో ఉందని టాలీవుడ్ టాక్.
ఈ నేపథ్యంలో చిరు పెద్ద కుమార్తె మెగా హీరోలతో పాటు ఇతరత్రా హీరోలతో చిత్రీకరణ చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. సోదరుడి స్ఫూర్తి, తండ్రి ఆశీస్సులతో ఆమె నిర్మాతగా రాణించాలని ఆశిద్దాం.