హీరోయిన్లంతా తమ ఆరోగ్య సమస్యలపై ఓపెన్ గా స్పందిస్తున్న రోజులివి. శృతిహాసన్, రకుల్, దీపిక పదుకోన్ లాంటి హీరోయిన్లు చాలామంది తమ ఆరోగ్య సమస్యల్ని బయటపెట్టారు. హీరోయిన్ తమన్నకు కూడా ఓ ఆరోగ్య సమస్య ఉంది. అయితే దాన్ని పైకి చెప్పుకోలేనంటోంది మిల్కీబ్యూటీ.
“నాకు మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి. కాకపోతే అతిగా నేను వర్క్ చేయడం వల్ల, ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేయడం వల్ల నాకు కూడా ఓ ఆరోగ్య సమస్య ఎదురైంది. అయితే దాన్ని నేను బయటకు చెప్పుకోలేను.”
ఇలా తనకు ఆరోగ్య సమస్య ఉందంటూనే దాన్ని పైకి చెప్పలేనంటోంది తమన్న. తన సమస్యను అధిగమించేందుకు ప్రస్తుతం ఆర్గానిక్ ఆహార పదార్థాలు, ప్రక్రియలపై ఆధారపడినట్టు తెలిపింది తమన్న. ఇందులో భాగంగా అతిగా వేయించిన వంటకాలు తినడం ఆపేసిందట.
ఇక ఈమధ్య కాలంలో నోని పండు (తొగరి పండు లేదా మొలుగు పండు అని కూడా పిలుస్తారు) నుంచి తీసే జ్యూస్ తాగుతోంది తమన్న. ఇది తనకు ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పుకొచ్చింది. దీంతో పాటు తినే వంటకాల్లో పసుపు ఎక్కువగా ఉండేలా జాగ్రత్తపడుతోంది. దీంతో పాటు సాయంత్రం ఉసిరి జ్యూస్ తో పాటు రోజులో మూడు సార్లు కీర జ్యూస్ తాగుతుందట. ఇలా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని చెబుతోంది. వీటితో పాటు మధ్యమధ్యలో ఆల్మండ్ మిల్క్, కొబ్బరి నీళ్లు తాగుతానని చెప్పుకొచ్చింది.
ఇలా ఘనాహారం కంటే, ద్రవాల్నే ఎక్కువగా తీసుకుంటోంది తమన్న. దీని వల్ల బరవు పెరగడం అనే సమస్య ఉండదని, పైగా ప్రతి రోజూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండొచ్చని చెబుతోంది. 13 ఏళ్లుగా రెస్ట్ లేకుండా పని చేస్తున్న తను, కెరీర్ స్టార్టింగ్ లోనే ఓ మంచి డైటీషియన్ ను నియమించుకోకుండా తప్పుచేశానని, ఇప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది.