ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. దీన్ని అందరికీ గుర్తుచేసేందుకు ఏటా ఏప్రిల్ 7న అంటే, ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్న తన ఆరోగ్య రహస్యాల్ని బయటపెట్టింది. రోజూ పొద్దున్నే బ్రష్ ఎలా చేస్తామో, అలా అంతా వ్యాయామం చేయాలంటోంది.
ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ గంటపాటు వ్యాయామం చేస్తుంది తమన్న. యోగా, స్విమ్మింగ్, కార్డియో, వెయిట్ ట్రైనింగ్.. ఇలా ఏదో ఒక రూపంలో గంట పాటు జిమ్ లో చెమట్లు కక్కాలని సూచిస్తోంది. వ్యాయామానికి తగ్గట్టు మంచి ఆహారం తీసుకోవాలని చెబుతోంది.
నానబెట్టిన బాదం పప్పులతో తన రోజువారీ డైట్ ను ప్రారంభిస్తుంది మిల్కీబ్యూటీ. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్.. ఇలా ఏది తిన్నా అందులో పోషకాలు ఏమున్నాయి, ఏ మోతాదులో ఉన్నాయి అనే అవగాహనతో తినాలని చెబుతోంది.
ప్రొటీన్ ఎక్కువగా ఉండే పదార్థాల్ని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంది తమన్న. ఇక లంచ్ లో పప్పు, బ్రౌన్ రైస్, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటుంది. చిరుధాన్యాలతో చేసిన స్నాక్స్ తింటుంది, నీటితో పాటు జ్యూస్ లు ఎక్కువగా తాగుతుంది.
ఇలా మంచి ఆహారం తీసుకోవడంతో పాటు, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం అవసరమని చెబుతోంది. ఒకవేళ వ్యాయామం చేయడం కుదరకపోతే కనీసం 30-40 నిమిషాలు వాకింగ్ చేయాలని సూచిస్తోంది. 34 ఏళ్ల వయసులో కూడా అదే అందాన్ని, ఫిజిక్ ను కొనసాగిస్తోందంటే, దానికి కారణం లైఫ్ లో క్రమశిక్షణ అని చెబుతోంది.