ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా కల్కి. తన సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాను మే 9న విడుదల చేయాలనుకున్నాడు నిర్మాత అశ్వనీదత్. కానీ సరిగ్గా అదే టైమ్ కు ఎన్నికలొచ్చి పడ్డాయి. దీంతో వాయిదా అనివార్యమైంది.
అయితే జూన్ నెలలో కూడా బాక్సాఫీస్ బరిలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో నిదానంగా కొత్త విడుదల తేదీ ప్రకటించాలని మొన్నటివరకు మేకర్స్ భావించారు. కానీ ఊహించని విధంగా జూన్ నెలకు భారతీయుడు-2 వచ్చి పడింది. ఆ సినిమాకు కనీసం 2-3 వారాలైనా గ్యాప్ ఇవ్వాలి. దానికి పోటీగా వెళ్లడానికి వీల్లేదు. ఎందుకుంటే. భారతీయుడు-2లో హీరోగా నటించిన కమల్ హాసన్, కల్కిలో కూడా ఉన్నారు.
దీంతో కల్కి యూనిట్ ఆలోచనలో పడింది. లేట్ చేస్తే మరిన్ని తేదీలు మిస్సవ్వాల్సి వస్తుంది. అందుకే షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేసుకొని ఈ నెల్లోనే కొత్త విడుదల తేదీ ప్రకటించడానికి రెడీ అవుతోంది.
కల్కి సినిమాకు సంబంధించి షూటింగ్ కొలిక్కి వచ్చింది, గ్రాఫిక్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇంతకుముందు అనుకున్న మే 9 డెడ్ లైన్ ప్రకారమే యూనిట్ పనిచేస్తోంది.
సో.. ఫస్ట్ కాపీ రెడీ అయితే, మే నెల చివరివారంలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మే 30వ తేదీ అనుకుంటున్నారు. ఆరోజు గురువారం పడింది. అలా లాంగ్ వీకెండ్ కలిసొస్తుందని భావిస్తున్నారు. అటు భారతీయుడు-2 సినిమాకు కూడా గ్యాప్ ఇచ్చినట్టవుతుంది. ఇదే తేదీకి వస్తారా రారా అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.