సినిమా తారలను ఎండోర్స్ మెంట్ వ్యవహారాలు ఇక్కట్లలో పడేయడం కొత్త కాదు. తాము ఫలానా సినిమా తార చెప్పడం వల్ల ఫలానా చోట రియలెస్టేట్ లో ఇన్వెస్ట్ చేశామని, సదరు సంస్థ తమ ను మోసం చేసిందంటూ.. దానికి బాధ్యత సదరు సినిమా తారది కూడా అంటూ కొంతమంది కేసులు పెడుతూ ఉంటారు. అయితే అలాంటి వ్యవహారాల్లో సినిమా తారలు పెద్దగా ఇబ్బంది పడటం లేదు కానీ, ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ , బెట్టింగ్ యాప్స్ లను ప్రమోట్ చేస్తూ కొందరు బుక్ అవుతూ ఉన్నారు.
మొబైల్ గేమింగ్ యాప్ ప్రమోషన్ రూపంలో ఇప్పుడు విపరీతంగా బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ అవుతూ ఉన్నాయి. అన్నీ గేమింగ్ యాప్సే అనే అంటారు. అయితే అందులో డబ్బులు పెట్టి ఆడేవే ఎక్కువ! లూడో తో మొదలు క్రికెట్, ఐపీఎల్ సమయాల్లో బెట్టింగ్ ఒక రేంజ్ లో సాగుతూ ఉంది దేశంలో. సవాలక్ష యాప్ లు అందుబాటులోకి వచ్చాయి జనాలకు. వీటిని సులభంగా ప్రమోట్ చేసుకోవడానికి సినిమా వాళ్లను, క్రికెటర్లను వాడుకుంటూ ఉన్నాయి సదరు సంస్థలు. అన్నీ బెట్టింగ్ యాప్ లే అయినా.. కొన్ని చట్టపరిధిలో వ్యాపారం చేస్తుంటే మరి కొన్ని ఇంకా వక్రమార్గాలను తొక్కుతూ ఉన్నాయి. అలాంటి వాటిని ప్రమోట్ చేసిన వారికి విచారణలు అయితే తప్పడం లేదు.
ఉత్తరాదిన వెలుగు చూసిన ఒక బెట్టింగ్ యాప్ స్కామ్ లో బాలీవుడ్ తారలు చాలా మంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, శ్రద్ధా కపూర్, కపిల్ శర్మ తదితరులు ఇప్పటికే ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ వ్యవహారంలోనే ఆ బెట్టింగ్ యాప్ కు సంబంధించిన ఒక ఆన్ లైన్ స్ట్రీమింగ్ అప్లికేషన్ ను ప్రమోట్ చేసినందుకు గానూ తమన్నా ను ఈడీ పిలిచింది. గువాహటిలో ఈడీ కార్యాలయంలో తమన్నా విచారణకు హాజరు అయ్యింది.
కేవలం ప్రమోట్ చేసి ఉంటే ఈ సినిమా తారలకు పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. తెలియక చేశామనో, గుట్టు తెలియదనో వాదించుకోవచ్చేమో! అయితే ఆర్థిక వ్యవహారాలతో ఏమైనా ముడులు ఉంటేనే వీరికి ఇబ్బందులు ఉండవచ్చు. ప్రమోషన్ కు గానూ పొందిన డబ్బు ఎలా అందింది, ఏ రూపంలో అందింది, ఎంత అందింది.. వంటి వ్యవహారాలకు వీరు సమాధానాలు చెప్పుకోవాల్సి రావొచ్చునేమో. మొత్తానికి యాడ్స్ తో డబ్బులు ఈజీగా వచ్చేసే రోజుల్లో సదరు సంస్థల దందాలు సినిమా వాళ్లను ఇలాంటి అనుకోని ఇబ్బందుల్లోకి లాగుతున్నట్టుగా ఉన్నాయి.
she is innocent , leave her alone GA