Advertisement

Advertisement


Home > Movies - Movie News

తప్పు రవితేజ దా? నిర్మాతల దా?

తప్పు రవితేజ దా? నిర్మాతల దా?

ఓ హీరో తన కెరీర్ లో వరుసగా ఫ్లాపులు ఇస్తూ వెళ్తూ వుంటే, అతనిపై కోట్లు కుమ్మరించే నిర్మాతలది తప్పా? లేక ఇస్తున్న కోట్లు తీసుకుంటూ వాళ్లు తెస్తున్న ప్రాజెక్టులు అన్నీ చేసుకుంటూ పోతున్న హీరోదా? తెలుగు హీరొలకు ఓ భరోసా..పది ఫ్లాపులు ఇచ్చినా ఒక్క హిట్ ఇస్తే మళ్లీ వరుసగా సినిమాలు చేతిలోకి వస్తాయని. ఆంజనేయులు సినిమా టైమ్ లో అయిదు కోట్ల రేంజ్ లో రెమ్యూనిరేషన్ తీసుకున్న హీరోకి ఇప్పుడు పోటీలుపడి 18 కోట్లు ఇస్తూ, నష్టాలు మూటగట్టుకోవడం అంటే హీరో తప్పా? నిర్మాతల తప్పా?

సీనియర్ హీరో రవితేజ కెరీర్ భలే చిత్రంగా వుంటుంది. ఒక్క హిట్..అరడజను ఫ్లాపులు అన్నట్లు సాగుతూ వుంటుంది. 2010 కి ముందు కొంత నయం.. ఒకటి రెండు ఫ్లాపులు, ఓ హిట్ అన్నట్లు వుండేది. కానీ ఆ తరువాత నుంచి గ్రాఫ్ మరీ పడిపోతూ వస్తోంది.

2012 నిప్పు..దరువు..దేవుడు చేసిన మనుషులు..సారొచ్చారు

2013బలుపు..

2014..పవర్

2015..కిక్ 2…బెంగాల్ టైగర్

2017..రాజా ది గ్రేట్…టచ్ చేసి చూడు

2018..నేలటికెట్..అమర్ అక్బర్ ఆంధోని

2020..డిస్కోరాజా

2021..క్రాక్.. ఖిలాడీ

2022..రామారావు ఆన్ డ్యూటీ

వీటిలో ఎన్ని హిట్ లు, ఎన్ని యావరేజ్ లు..ఎన్ని డిజాస్టర్లు అన్నది వివరించాల్సిన పని లేదు. సినిమా జనాలకే తెలుసు. రాజా ది గ్రేట్ తరువాత నాలుగు ఫ్లాపులు ఇచ్చాక క్రాక్ సినిమా పడింది. అది హిట్ కావడంతో ఏకంగా అరడజనుకు పైగా సినిమాలు చేతిలోకి వచ్చాయి. ఖిలాడీ సినిమా దారుణంగా పరాజయం పాలయింది బాక్సాఫీస్ దగ్గర. అదే డిజాస్టర్ అనుకుంటే దాన్ని మించిన డిజాస్టర్ గా రికార్డులకు ఎక్కుతోంది రామారావు ఆన్ డ్యూటీ. అంతకు ముందు కూడా ఇలాంటి భయంకరమైన ఫ్లాపులు వున్నాయి. నేలటికెట్..అమర్ అక్బర్ ఆంథోనీ..టచ్ చేసి చూడు ఇలాంటివే.

నిజానికి రవితేజ ఓ డిఫరెంట్ హీరో. ఇటు ఫ్యామిలీలకు నచ్చుతాడు. అటు మాస్ కి నచ్చుతాడు. ఫన్ చేస్తే థియేటర్లు మామూలుగా ఊగవు. అతనిదో స్టయిల్. అతనికి మాత్రమే స్వంతమైన స్టయిల్. కానీ సరైన కథ, కథనం లేకపోతే సినిమా మొదటి రోజునే అక్కడే ఆగిపోతుంది. అదే సమస్య. యావరేజ్ లు కన్నా ఫ్లాపులే వుంటాయి. అదే సమస్య.

గమ్మత్తేమిటంటే క్రాక్ తరువాత 10 కోట్ల నుంచి అలా అలా 18 కోట్లకు చేరిపోయింది రవితేజ రెమ్యూనిరేషన్ అన్నది ఇండస్ట్రీ కాక్. అది ఎంత వరకు నిజం అన్నది నిర్మాతలకే తెలియాలి. దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేసారు రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ సినిమాలకు కలిపి. ఎంత రికవరీ వచ్చింది థియేటర్ నుంచి. కేవలం నాన్ థియేటర్ రైట్స్ నుంచి వచ్చే మొత్తాలు చూసి, సినిమాల నిర్మాణానికి సై అంటూ దిగిపోతున్నారు. మామూలుగానే సినిమా యావరేజ్ గా వున్నా థియేటర్లకు జనాలు రావడం లేదు. ఇక ఫ్లాప్ అంటే థియేటర్ మొహం చూడడం లేదు. దాంతో థియేటర్ మీద మిగిలి పోయిన మొత్తం పోతోంది. దీంతో నిర్మాతలు కుదేలయిపోతున్నారు.

కొంత మంది హీరోలు కాస్త వెనక్కు అయినా ఇస్తారని, ఇచ్చారని వార్తలు వినిపించిన దాఖలాలు వున్నాయి. కానీ రవితేజ నుంచి అలాంటి వార్తలు ఎప్పుడూ వినిపించలేదు. పైగా ఏ హీరోకి వినిపించినట్లుగా, రవితేజకు మాత్రం డబ్బింగ్ చెప్పడం లేదనే వార్తలు అప్పుడు అప్పుడు వినిపిస్తూ వుంటాయి. అవి పని పాటా లేని బ్యాచ్ రాసే వార్తలుగా ఆయన కోట్టి పారేయచ్చు. కానీ కొందరు దర్శకులు, నిర్మాతలు ఆఫ్ ది రికార్డుగా చెప్పే కథలు వేరుగా వుంటాయి. షూటింగ్ కు రవితేజ పెట్టే షరతులు, వాటి వల్ల వచ్చే ఇబ్బందుల గురించి ఇటీవలే అతనితో ఫ్లాప్ ఇచ్చిన ఓ దర్శకుడు ఆఫ్ ది రికార్డుగా ఎన్నో చెబుతూ వస్తుంటారు.

ఓ హీరో దొరికితే సినిమా చేసేద్దాం అన్నది నిర్మాతల ఆశ..ఆలోచన. అందులో తప్పు లేదు. వ్యాపారం కనుక చేయాల్సిందే. కానీ లెక్కలు చూసుకోవాలి కదా? ఏ మేరకు రిటర్న్ వస్తుంది… క్రాక్ ముందు ఏమిటి? తరువాత ఏమిటి? అసలు క్రాక్ ఎందుకు ఏ పరిస్థితుల్లో ఎలా హిట్ అయింది అన్నది చూడాలి కదా. క్రాక్ కు సరైన కథ దొరికింది. సరైన యాక్షన్ సీక్వెన్స్ లు కుదిరాయి. ఎలివేషన్లు అదిరాయి. కోవిడ్ టైమ్ లో ఆకలితో వున్న ప్రేక్షకులకు అది అమృతంలా తోచింది.

ఖిలాడీ సినిమాకు ఎలివేషన్లు వున్నాయి. మంచి పాటలు వున్నాయి. రిచ్ పిక్చరైజేషన్ వుంది. అయినా జనం భరించలేకపోయారు. రవితేజ మీద ఎంత అభిమానం వున్నా ఆ ఫోర్స్ డ్ ట్విస్ట్ లు జనం అంగీకరించలేదు. ఖిలాడీలో రవితేజ వైపు నుంచి చూస్తే కొంత బెటర్. కానీ రామారావు ఆన్ డ్యూటీలో రవితేజను అతని అభిమానులు కూడా యాక్సెప్ట్ చేయలేరు. ఆ జోష్..ఆ హుషారు..ఆ స్పీడ్..ఆ వెటకారం మచ్చుకైనా కనిపించలేదు. రవితేజకు ఇది డిఫరెంట్ పాత్ర అని అనిపిస్తే అనిపించి వుండొచ్చు. కానీ అభిమానులకు నచ్చలేదు.

పైగా రవితేజ సీనియర్ హీరో. వయసు మీద పడిన దగ్గర నుంచి గ్లామర్ తగ్గడం సర్వ సాధారణం. సినిమాలో అది కనిపించకుండా చూడడానికి చాలా సాంకేతిక సదుపాయాలు వున్నాయి. వీటిమీద రవితేజ దర్శకులు, నిర్మాతలు అంతలా దృష్టి పెడుతున్నట్లు కనిపించడం లేదు. గతంలో మేకోవర్ కోసం తన శరీరాకృతిని తగ్గించుకున్న దగ్గర నుంచి ఫేస్ లో తేడా వచ్చింది. ఆరంభంలో అది మరీ ఇబ్బందిగా వుండేది. తరువాత తరువాత బాగుంది. కానీ మళ్లీ రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు వచ్చేసరికి తేడా వచ్చింది. పైగా రవితేజ పక్కన మరీ పొట్టిగా, బొద్దుగా వున్న హీరోయిన్ ను తీసుకోవడం అంటే దర్శకుడి ఆలోచన ఏ విధంగా వుందనుకోవాలి.

ఇకనైనా దర్శకులు..నిర్మాతలతో పాటు రవితేజ కూడా ఆలోచించుకోవాలి. రవితేజను ఎంత ఇచ్చి ఒప్పించగలం అన్నది కాదు. ఎలాంటి కథల్లో జనం చూస్తారు. ఎలా అయితే చూస్తారు..ఎంత ఖర్చు చేస్తే ఓ రూపాయి మిగులుతుంది..ఇవన్నీ చూసుకోవాలి. అంతే తప్ప, 18 కోట్లు ఇస్తే చాలు రవితేజ డేట్లు దొరికేస్తాయి. సినిమా చుట్టేద్దాం అని మాత్రం కాదు. ఇది నిర్మాతలకే కాదు. రవితేజ కు కూడా ప్రమాదం. 

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను