చంద్రబాబు తపస్సు ఫలిస్తోందా? అంటే… ఔనని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ చల్లని చూపు కోసం చంద్రబాబు గత మూడేళ్లుగా తపస్సు చేస్తున్నారు. 2019కు ఏడాదిన్నర ముందు ఎన్‌డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చింది. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకూ బీజేపీ, మోదీలపై చంద్రబాబు చేయని విమర్శ లేదు. పరిపాలనలో మోదీ సర్కార్ అట్టర్ ప్లాప్ అయ్యిందంటూ దేశమంతా చంద్రబాబు కలియతిరిగి విమర్శలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి, మోదీ నాయకత్వానికి ఓట్లు వేయొద్దని చంద్రబాబు దేశ ప్రజానీకానికి పిలుపునిచ్చారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు బొక్క బోర్లా పడ్డారు. కేవలం 23 ఎమ్మెల్యే, మూడు పార్లమెంట్ సీట్లతో చంద్రబాబు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదంతా మోదీతో విరోధం పెట్టుకోవడం వల్లే అని చంద్రబాబు భావించారు. ఇక అప్పటి నుంచి మోదీ సర్కార్‌పై నోరు తెరిచిన పాపాన పోలేదు. గత సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ భార్య, తల్లిని సైతం మాట్లాడిన చంద్రబాబు ఈయనేనా? అనే అనుమానం వచ్చేలా… టీడీపీ నేత మౌనాన్ని ఆశ్రయించారు.
2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు తపిస్తున్నారు. ఏపీలో బీజేపీ ప్రభావం శూన్యమని తెలిసినా, కేంద్రంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏపీలో జగన్‌ను ఇబ్బంది పెట్టొచ్చనేది బాబు ఎత్తుగడ. అయితే గతంలో రెండుమూడు సందర్భాల్లో బాబు చేతిలో మోసపోయిన బీజేపీ, ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించడానికి ఆ పార్టీ సిద్దంగా లేదు. చంద్రబాబును ఏ మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తీపి కబురు చంద్రబాబుకు వచ్చింది. 75 ఏళ్ల స్వాతంత్ర్య మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఉత్సవాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహించే సన్నాహక సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపడాన్ని టీడీపీ శుభసంకేతంగా భావిస్తోంది.
ఈ నెల 6న చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబుపై బీజేపీలో వచ్చిన సానుకూల మార్పుగా టీడీపీ ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ మార్పు రాజకీయ సమీకరణలకు బీజం వేస్తుందా? లేక ఈ కార్యక్రమానికే పరిమితం అవుతుందా? అనేది మున్ముందు తెలిసే అవకాశం ఉంది. కానీ ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వానికి దగ్గర కావాలన్న చంద్రబాబు కోరిక ఈ రూపంలో తీరనుందని చెప్పొచ్చు.