మంచు మోహన్ బాబు మాటలు సూటిగా వుంటాయి. అయితే నర్మగర్భంగా కూడా వుంటాయి. ఇప్పుడు ఆయన పేల్చిన మాటల తూటాలు డిస్కషన్ పాయింట్ గా మారాయి. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీని ఇద్దరు హీరోలు టార్గెట్ చేస్తున్నారని, వారే ఇరవై ముఫై మందిని అపాయింట్ చేసుకుని, ట్రోలింగ్ చేయిస్తున్నారని, వారెవరో తనకు తెలుసు అని మోహన్ బాబు అన్నారు.
ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి.
ఒకటి మోహన్ బాబు ఫ్యామిలీతో ఇండస్ట్రీలో వారు ఎవరైనా పెట్టుకుంటారా? ఇటు మీడియా అటు సినిమా జనాలు వీలయినంత దూరంగా వుండడానికే చూస్తారు. ఎందుకంటే మంచు ఫ్యామిలీ అంటే అంత భయం వుంది కనుక. ఆ భయం ఎందుకు? ఎలా? అన్నది వేరే సంగతి. అందువల్ల ఇద్దరు హీరోలు పనిగట్టుకుని మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసారు అంటే నమ్మడం కాస్త కష్టం. పైగా మోహన్ బాబుకు వాళ్లెవరో తెలిసిన తరువాత ఊరుకునే రకం కాదు. వాళ్ల సంగతి చూసి కానీ వదలరు.
ఇక రెండో పాయింట్. అసలు మంచు ఫ్యామిలీ మీద ఎవరికైనా ఎందుకు పగ వుంటుంది. అందులోనూ సినిమా రంగంలో. నిన్న మొన్న మా ఎన్నికలు వచ్చేవరకు మంచు ఫ్యామిలీని ఎవ్వరూ టార్గెట్ చేయలేదు. మొదటి నుంచి మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో కాస్త ఫన్ స్టఫ్ గానే వుంటూ వస్తోంది. మంచు లక్ష్మి ఇంగ్లీష్ కావచ్చు. వారి ఆటిట్యూడ్, ఇతరత్రా వ్యవహారాలు కావచ్చు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగానే వుంటూ వస్తోంది.
మంచు ఫ్యామిలీ కూడా దీన్ని లైట్ తీసుకుంటూనే వుంది. తనపై వస్తున్న ట్రోల్స్ ను మంచు లక్ష్మి తనే ఇమిటేట్ చేసి నవ్వులు పండించిన సందర్బాలు వున్నాయి. మంచు మనోజ్ అంటే సోషల్ మీడియా సాప్ట్ గానే వుంటుంది. పెద్దగా పట్టించుకోదు. మంచు మోహన్ బాబును అస్సలు పట్టించుకోదు. ఆయన కూడా ఆ అవకాశం ఇవ్వరు. మంచు విష్ణు మీద మాత్రం యాంటీ వైకాపా బ్యాచ్ లు కొంత వరకు ట్రోలింగ్ చేస్తుంటాయి. అది రాజకీయ వ్యవహారాలు.
అంతే తప్ప హీరోలు ఎవ్వరో పని గట్టుకుని డబ్బులు ఖర్చు చేసి మరీ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తారని అనుకోవడం కాస్త వాస్తవదూరమే కావచ్చు