దర్శకుడు తరుణ్ భాస్కర్ మరోసారి సోషల్ మీడియాలో అందరితో తిట్లు తింటున్నాడు. ఇతడు ఒకర్ని తిట్టడం, మళ్లా తిట్టించుకోవడం కొత్తకాదు. ఈసారి కూడా అదే రిపీట్ అయింది. ఇంతకీ ఈ తిట్ల వర్షానికి కారణం ఏంటో తెలుసా.. తాజాగా ఓ పోస్ట్ పెట్టాడు ఈ దర్శకుడు.
“హీరో గట్టిగా పిచ్చోడిలా రీసౌండ్ చేసుకుంటూ అరవడు. అందరి కంటే స్మార్ట్ గా ప్రతి డైలాగ్ లో సామెత చెప్పడు. ఎక్స్ ట్రీమ్ స్లో మోషన్ లో ఫిజిక్స్ ఫెయిల్ ఫైట్లు ఉండవు. ప్రతి 2 నిమిషాలకు హీరో రీఎంట్రీ ఉండదు. చివరి 10 నిమిషాల్లో ర్యాండమ్ గా రైతుల గురించో, సైనికుల గురించో, ఇండియా గురించో మెసేజ్ ఉండదు. కానీ దీన్ని కూడా ఆ ఊరిలో సినిమా అంటారు మరి.”
కప్పెళ అనే మలయాళ సినిమాను పొగుడుతూ ఇలా టాలీవుడ్ హీరోల్ని విమర్శించాడు ఈ దర్శకుడు. దీంతో నెటిజన్లు గట్టిగా తగులుకున్నారు. ఎలాంటి సినిమాలు చూడాలో నువ్వు మాకు ఉచిత సలహాలివ్వక్కర్లేదంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీనికితోడు తరుణ్ పైన ఇచ్చిన స్టేట్ మెంట్ లో కొందరు హీరోల్ని ఊహించుకున్న ఫ్యాన్ గ్రూపులు మరింత రెచ్చిపోయాయి.
ఇలా కొంతమంది హీరోల ఫ్యాన్స్ తో చీవాట్లు తిన్న తరుణ్ భాస్కర్ అస్సలు తగ్గలేదు. ఈసారి మరింత ఘాటుగా మరో పోస్టు పెట్టాడు. తనపై విమర్శలు చేస్తున్న ట్రోలర్స్ అంతా నకిలీ ఐడీలతో, సోషల్ మీడియాలో దాక్కుని తిడుతున్నారని, వాళ్లకు ఆత్మాభిమానం లేదని విమర్శించాడు. అక్కడితో ఆగలేదు ట్రోలింగ్ చేసేవాళ్లని మొరిగే కుక్కలతో పోల్చాడు. తనను ఎవ్వరూ ఆపలేరన్నాడు.
తరుణ్ భాస్కర్ పెట్టిన తాజా ట్వీట్ తో అతడిపై ట్రోలింగ్స్ ఇంకాస్త ఎక్కువయ్యాయి కానీ తగ్గలేదు. కొంతమంది అతడికి మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. ఈ సోషల్ మీడియా లొల్లి ఎప్పటికి ఆగుతుందో!