కొన్నేళ్ల కిందటి సంగతి… తను తీసిన రుద్రుమదేవి సినిమాకు చంద్రబాబు సర్కార్ అవార్డ్ ఇవ్వనందుకు బాహాటంగా తన నిరసన తెలియజేశాడు దర్శకుడు గుణశేఖర్. రుద్రమదేవి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వలేదని, అదే టైమ్ లో బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చారని, ఎందుకిలా చేశారని ప్రశ్నించాడు.
“మరిచిపోయిన తెలుగుజాతి చరిత్రను వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తుచేశాడు. మళ్లీ అవార్డ్ ఇచ్చి గుర్తుచేయడం ఎందుకని అవార్డ్ ఇవ్వలేదా?” అంటూ సూటిగా ప్రశ్నించాడు. అప్పుడెప్పుడో గుణశేఖర్ రాసిన ఈ బహిరంగలేఖను ఇప్పుడు మరోసారి వెలికితీశారు. అది కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఈ పని చేశారు. దీనికి ఓ కారణం ఉంది..
అప్పట్లో తెలుగుజాతి చరిత్ర అంటూ రుద్రమదేవి తీసిన గుణశేఖర్, ఇప్పుడు ఏకంగా అభిజ్ఞాన శాకుంతలంను సినిమాగా తీశాడు. సమంతను పెట్టి తీసిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. మూవీ ఇలా ఫ్లాప్ అవ్వడం ఆలస్యం, అప్పట్లో గుణశేఖర్ చేసిన హంగామాను బయటకు తీశారు టీడీపీ సానుభూతిపరులు.
శాకుంతలం లాంటి సినిమాలు తీసేబదులు.. మూవీస్ తీయడం మానుకోవాలంటూ పోస్టులు పెట్టారు. “ప్రశ్నించడం తప్పా” అంటూ అప్పట్లో గుణశేఖర్ లేఖ విడుదల చేస్తే.. “నువ్వు ఇప్పుడు సినిమాలు తీయడమే తప్పు” అంటూ పోస్టులు పెడుతున్నారు టీడీపీ సానుభూతిపరులు.
అప్పుడు రుద్రమదేవి తీసి అవార్డు ఎందుకివ్వలేదని ప్రశ్నించిన గుణశేఖర్, ఇప్పుడు శాకుంతలం సినిమాకు కూడా అవార్డ్ డిమాండ్ చేయాలని టీడీపీ వర్గీయులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వయసు మీదపడి అప్పట్లా ఘాటుగా లేఖ రాయడం రాకపోతే, తాము రాసిస్తామని, అది జగన్ కు పంపించాలని ర్యాగింగ్ షురూ చేశారు.
మరికొంతమంది మరో అడుగు ముందుకేసి, శాకుంతలం సినిమాను ఆస్కార్ కు పంపించాలని, అవార్డ్ రాకపోతే “ప్రశ్నించడం తప్పా” అంటూ ఇంగ్లిష్ లో లెటర్ రాయాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అప్పుడెప్పుడో వేరే సందర్భంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాసిన లేఖ, ఇప్పుడీ సందర్భంలో ఇలా బయటకొస్తుందని గుణశేఖర్ ఊహించి ఉండరు. ఊహించి ఉంటే ఆరేళ్ల కిందట పెట్టిన ఆ ట్వీట్ ను డిలీట్ చేసి ఉండేవాడు.