Advertisement

Advertisement


Home > Movies - Reviews

Vidudala Part 1 Review: మూవీ రివ్యూ: విడుదల-పార్ట్1

Vidudala Part 1 Review: మూవీ రివ్యూ: విడుదల-పార్ట్1

చిత్రం: విడుదల
రేటింగ్: 2.75/5
తారాగణం: సూరి, విజయ్ సేతుపతి, భవాని, గౌతం వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, బాలాజి శక్తివేల్ తదితరులు
సంగీతం: ఇళయరాజా
ఎడిటింగ్: ఆర్ రామర్
ఆర్ట్: జాకీ
దర్శకత్వం: వెట్రిమారన్
విడుదల తేదీ: ఏప్రిల్ 15, 2023

వెట్రిమారన్ అనగానే సినిమాలపై ఆసక్తి ఉన్న తెలుగు వాళ్లకి కూడా ఠక్కున గుర్తొచ్చే సినిమాలు విచారణై, అసురన్, కాక ముట్టై. అతనిది ఒక ప్రత్యేక శైలి. నిజజీవిత కథకి కాల్పికనత జోడించినా, కల్పిత కథని నిజజీవిత కథ మాదిరిగా తీసినా అది అతనికే చెల్లు అన్నట్టుంటాయి. అణచివేత, బాధలు, ప్రతీకారం, పోరాటం, పోలీసులు, ఖైదీలు, నేరం, న్యాయం, చట్టం...ఇవే ప్రధానంగా వెట్రిమారన్ కథా వస్తువులు. ఇప్పుడు కొత్తగా వచ్చిన "విడుదల పార్ట్ 1" కూడా ఆ కోవకు చెందినదే. 

ఒక ట్రైన్ బాంబింగ్ సీన్ తో కథ మొదలవుతుంది. 1987 నాటి ప్రజాదళానికి సంబంధించిన పెరుమాళ్ అనే దళనాయకుడిని పట్టుకునేందుకు "ఆపరేషన్ ఘోష్ట్ హంట్" పేరిట పోలీసులు ఒక వలయం పన్నుతారు. కానీ అతనెలా ఉంటాడో తెలియదు, ఒక పట్టాన దొరకడు. 

కొత్తగా రిక్రూట్ అయిన కుమరేష్ (సూరి) పెరుమాళ్ ని పట్టుకునే ట్రూప్ లో చేరతాడు. అతను చాలా మంచివాడు, సీనియర్లకు తలవంచి పని చేస్తాడు, ఓర్పు, ఓపిక, వినయం, విధేయత, వృత్తిపట్ల అంకిత భావం తారాస్థాయిలో ఉన్నవాడు. అతనికి కొండ ప్రాంతానికి చెందిన ఒకమ్మాయితో పరిచయం పెరిగి ప్రేమగా చిగురిస్తుంటుంది. ఆ సమయంలో ఆమె పోలీసుల నుంచి పెద్ద ప్రమాదంలో చిక్కుకుంటుంది. తాను కూడా ఒక పోలీసై ఉండి ఆమెను పోలీసుల టార్చర్ నుంచి విముక్తి చేయడానికి నానా కష్టాలు పడతాడు. అంతటితో ప్రధమ భాగం ముగుస్తుంది. మిగతాది సీక్వెల్ లో చూడాలి. 

ఎప్పటిలాగానే వెట్రిమారన్ ప్రతి చిన్న విషయాన్ని చాలా కూలంకషంగా రీసెర్చ్ చేసి మరీ షూట్ చేసాడు. పోలీస్ పనిష్మెంట్లు, క్యాంపుల్లో వాళ్ల జీవన విధానం, కొండ ప్రాంతం వాళ్లతో వాళ్ల సంబంధాలు అన్నీ కళ్లకు కట్టినట్లు ఎక్కడా కృత్రిమత్వం లేకుండా నిజ జీవితాల్ని తెర మీద చూస్తున్నట్టుగా చాలా ఆసక్తికరంగా మలిచాడు. ఒక దశలో సూరి పాత్రతో ప్రేక్షకుడు ప్రేమలో పడతాడు. అతని పట్ల జాలి చూపిస్తాడు. అతనిలోని హీరో బయటపడాలని కోరుకుంటాడు. కానీ ఆ పాత్రకెంత ఓర్పు ఉంటుందో అంతటి "ఓర్పు పరీక్ష" ప్రేక్షకులకి కూడా పెట్టాడు దర్శకుడు. చివర్లో హీరోయిజం బయటికొచ్చినా అది సరిపోలేదు. ప్రేక్షకులు వహించిన ఓర్పుకి న్యాయం జరగలేదు. అలాంటిదేదైనా ఆశిస్తే సీక్వెల్ లో వెతుక్కోండి అన్నట్టుగా నిరాశపరిచి వదిలేసాడు వెట్రిమారన్. అదొక్కటే అసంతృప్తి. 

అయితే సినిమాలో హింసాకాండని చూసి తట్టుకోవడం చాలా కష్టం. స్త్రీలని వివస్త్రలను చేసి కొట్టడం వంటివి 18+ ఆడియన్స్ ని కూడా మానసికంగా డిస్టర్బ్ చేస్తాయి. పోలీస్ టార్చర్ ని పతాక స్థాయిలో చూపించిన సినిమా ఇది. 

అలాగే విజయ్ సేతుపతి పాత్రకి ఇచ్చిన బిల్డప్ కి తగ్గట్టుగా అతని రివీలింగ్ సీన్స్ లేవు. ఆ క్యారెక్టర్లోని డెప్త్ కూడా రెండవ భాగంలోనే చూడమన్నట్టుగా వదిలేసాడు దర్శకుడు. ఎలా చూసుకున్నా సీక్వెల్ పట్ల ఆసక్తి పెరిగే విధంగానే ముగించాడు. 

సాంకేతికంగా ఈ సినిమా చాలా విషయాల్లో బలంగా ఉంది. కెమెరా వర్క్ కానీ, ఎడిటింగ్ కానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. రైలు ప్రమాదం సీన్ కూడా ఈ రేంజ్ సినిమాకి చాలా పెద్ద స్కేల్ లో తీసినట్టే. ఆ విధంగా అవసరమైన చోట రాజీ పదకుండా అక్కర్లేని చోట అతి చేసి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ప్రేక్షకులని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి కథ నడిపిన వైనం ప్రశంసించదగ్గది. పాటలు పర్వాలేదు. 

కుమరేష్ గా నటించిన సూరి ఈ సినిమాకి హైలైట్. కామెడీ పాత్రలు వేసే తాను ఇలాంటి సీరియస్ కానిస్టేబుల్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ధీరోదాత్తమైన పాత్రలో జీవించేసాడు. 

విజయ్ సేతుపతికి ఈ తొలిభాగంలో పెద్దగా నిడివి లేదు. అతని ట్రాక్ ని సీక్వెల్ లో చూడాల్సిందే. అయితే కనిపించిన కాసేపు రక్తి కట్టించాడు. 

కౄరమైన పోలీసాఫీసర్ గా బాలాజి శక్తివేల్ ప్రేక్షకుల చేత పళ్లు కొరించాడు. అతనెప్పుడు చస్తాడా అన్నంత ఫీలింగ్ ప్రేక్షకుల్లో రప్పించగలిగాడు దర్శకుడు. 

భవాని పాత్రపేరు తమిళరసి. పాత్రకి సరిపోయింది. చక్కగా చేసింది. 

ఒక సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు ఎంత రీసెర్చ్ చెయ్యాలి, ప్రేక్షకులని కట్టి పారేసేలాగ ప్రతి చిన్న అంశానికి ప్రాముఖ్యతనిస్తూ కథనం ఎలా నడపాలి అనేవి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఎంచుకున్న తారాగణమంతా ఆయా పాత్రలకి తగ్గట్టుగా ఉండడం, అందరూ సరైన తూకంలో నటించి మెప్పించడం, 1987 నాటి వాతావరణాన్ని కళ్లముందు పెట్టేయడం సాధారణ విషయం కాదు. దర్శకుడి శ్రద్ధ, నిబద్ధత ఎలా ఉండొచ్చో చెప్పే సినిమా ఇది. 

మింగడానికి చాలా కష్టంగా ఉన్న పోలీస్ టార్చర్ సీన్స్, తేలిపోయిన క్లైమాక్స్ ని పక్కన పెడితే ఈ చిత్రం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సీక్వెల్ కోసం వేచి చూసేలా చేసింది. ఆ రెండు విషయాలూ కూడా గ్రిప్పింగ్ గా ఉండి ఉంటే మరింత పైస్థాయిలో ఉండేది ఈ తొలిభాగం కూడా. "విడుదల" విడుదలైనా పూర్తిగా విడుదలైనట్టు కాదు. సీక్వెల్ ఉంది కనుక, అది చూస్తే తప్ప మొత్తం కథ అవగతం కాదు కనుక ఇది సగం విడుదలే.  

బాటం లైన్: సగం విడుదల 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?