'బాహుబలి'లా దేశం మొత్తం తలెత్తి చూసే సినిమా తీసే పని రాజమౌళి ఒక్కడిదే అన్నట్టు ఉండిపోకుండా ఇప్పుడు మిగతావాళ్లు కూడా భారీ కలలు కంటున్నారు. తెలుగు సినిమాకి ఎల్లలు చెరిపేసి దేశమంతా విస్తరించాలనే తపనతో కదం తొక్కుతున్నారు. ప్రయత్నాలయితే జరిగాయి… పరిజ్ఞానమయితే పెరిగింది… కానీ పరిధులే చెరిగిపోలేదింకా!
తపన మాత్రం వుంటే సరిపోదని, ఖర్చు మాత్రం పెడితే పనవ్వదని… రాజమౌళిలాంటి విజన్‌తో పాటు ప్లానింగ్, ప్రమోషన్ కూడా అవసరమని తెలిసి వచ్చింది. పెద్ద సినిమాలు పరిశ్రమ పరిధులు పెంచాలని ప్రయత్నిస్తోంటే, చిన్న సినిమాలు సరికొత్త ఆలోచనలతో పరిఢవిల్లాయి.
పాన్ ఇండియా డ్రీమ్స్!
'బాహుబలి' తరహాలో పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తూ రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సాహో, సైరా రెండిటికీ మిక్స్‌డ్ రిజల్ట్స్ వచ్చాయి. ప్రభాస్‌కి 'బాహుబలి' ఇమేజ్ కలిసి రావడంతో 'సాహో' హిందీ మార్కెట్లలో సూపర్బ్ ఓపెనింగ్ తెచ్చుకుంది. హిందీ మార్కెట్‌లో సాహో హిట్టనిపించుకుంటే, మిగతా చోట్ల మాత్రం అంచనాలని అందుకోలేకపోయింది. ఇందుకు దర్శకుడు సుజీత్‌కి ఎక్కువ బ్లేమ్ వెళ్లింది. వరల్డ్ క్లాస్ యాక్షన్ సినిమా అందించాలనే తపనతో హంగుల మీద పెట్టిన దృష్టి బేసిక్ స్టోరీపై పెట్టలేదు. దాంతో ఈ చిత్రం సగటు ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేదు. ఖర్చనేది సెకండరీ అని, కాంటెంట్ అతి ముఖ్యమని 'సాహో' చిత్ర బృందం ఒక చేదు అనుభవం ద్వారా తెలుసుకోవాల్సి వచ్చింది.
పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేసిన మరో చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. మూలాలని మరచిపోని కథ, కథనాలు, ఇప్పటి ప్రేక్షకులకి కావాల్సిన సెవెంటీ ఎంఎం సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సు.. అన్నీ సైరాకి కుదిరాయి. కానీ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలని దాటి పక్క వారి దృష్టిలో వేయడమెలా అనేది తెలియలేదు. దీంతో తెలుగునాట 'బాహుబలి' చిత్రాలకి ధీటయిన ప్రదర్శన ఇచ్చినా కానీ మిగిలిన చోట్ల పరాభవం తప్పలేదు. చేయాల్సినవన్నీ చేసి అతి కీలకమైన ప్రమోషన్స్ విషయంలో క్లూలెస్ అయిపోవడంతో 'సైరా నరసింహారెడ్డి'ని పాన్ ఇండియా సినిమా చేద్దామనే కల నెరవేరలేదు.
విజయ దరహాసాలు!
టాప్ స్టార్ల సినిమాలు అతి తక్కువ విడుదలైన ఈ ఏడాదిలో మహేష్‌బాబుకి 'మహర్షి'గా కెరీర్ హయ్యస్ట్ గ్రాసర్ వచ్చింది. అయితే 'నాన్-బాహుబలి' రికార్డులని అధిగమిస్తుందనే అభిమానుల అంచనాలని మాత్రం మహర్షి అందుకోలేకపోయింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ ఇటీవలే చేసిన 'భరత్ అనే నేను', 'శ్రీమంతుడు' ఛాయలు ఎక్కువ వుండడం, దేవిశ్రీప్రసాద్ పాటలు అలరించలేకపోవడంతో సమ్మర్‌లో ఎలాంటి కాంపిటీషన్ లేకుండా వచ్చిన ఈ చిత్రం ఆ అడ్వాంటేజ్‌ని పూర్తిగా క్యాష్ చేసుకోలేకపోయింది.
ఈ ఏడాదికి సక్సెస్ తాలూకు ఫస్ట్ టేస్ట్‌ని 'ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ – ఎఫ్2' అందించింది. వెంకటేష్‌తో ఫ్యామిలీ సినిమాని ఫుల్ కామెడీ జోడించి తీస్తే ఎంతగా పేలుతుందనేది ఈ చిత్రం నిరూపించింది. వెంకటేష్‌కి తోడు వరుణ్ తేజ్ కలిసి అందించిన ఈ వినోదానికి సంక్రాంతి సీజన్ యాడ్ అవడంతో అంచనాలని మించి అదరగొట్టింది. పెట్టుబడికి రెండింతలకి పైగా లాభాలతో ఈ ఏడాదికి అతి పెద్ద విజయంగా నిలిచిన ఈ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో దర్శకుడు అనిల్ రావిపూడికి ఒకేసారి మిడ్ రేంజ్ సినిమాల నుంచి సూపర్‌స్టార్‌ని డైరెక్ట్ చేసే లెవల్‌కి ప్రమోషన్ లభించింది.
ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో కొన్ని మెప్పించగా వాటిలో అత్యుత్తమనిపించినది, ఈ ఏడాదికి ఉత్తమ తెలుగు చిత్రంగా నిలచింది మాత్రం 'జెర్సీ'. తండ్రీకొడుకుల అనుబంధానికి అద్దం పడుతూ క్రికెట్ నేపథ్యంలో ఒక 'ఫెయిల్డ్ క్రికెటర్' కథని అద్భుతంగా మలిచాడు గౌతమ్ తిన్ననూరి. ఆ పాత్రని ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిన అత్యద్భుతంగా పోషించాడు నాని.
ఎన్ని సార్లు ఫెయిల్ అయినా కానీ ఒకే ఎక్స్‌పెరిమెంట్‌ని మళ్లీ మళ్లీ చేసే సైంటిస్ట్‌లా తన ఫార్ములా వర్కవుట్ అయ్యే వరకు పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తూనే వున్నాడు. మొత్తానికి తాను ఆశించిన ఫలితం 'ఇస్మార్ట్ శంకర్'తో దక్కింది. పూరి తరహా హీరోయిజానికి రామ్ ఎనర్జీ ప్లస్ అవడంతో 'డబుల్ కా మీఠా' రిజల్ట్ వచ్చింది.
గత ఏడాదిలో కాస్త తడబడిన నాగచైతన్యకి శివ నిర్వాణ దర్శకత్వంలో సక్సెస్ 'మజిలీ' దొరికింది. పెళ్లయిన తర్వాత తొలిసారిగా తెరపై జంటగా కనిపించిన చైతన్య-సమంత జోడీ ఈ చిత్రానికి ప్రధానాకర్షణ అయింది. వేసవిలో ముందుగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆకట్టుకునే ఫ్యామిలీ డ్రామాతో పాటు సమంత అభినయం హైలైట్‌గా నిలిచింది.
ఇంతకాలం హీరోల చాటు హీరోయిన్‌గానే వుండిపోయిన సమంత 'ఓ బేబీ'తో హీరోలా సినిమాని తన అభినయంతో నడిపించింది. కొరియన్ ఫాంటసీ కథని నందిని రెడ్డి తెలుగు సెంటిమెంట్స్‌కి అనుగుణంగా మలిచిన తీరు, వినోదంతో పాటు సమపాళ్లలో కుదిరిన భావోద్వేగాలు ఈ చిత్రాన్ని సక్సెస్ చేసాయి. ఈ ఏడాదికి అతి పెద్ద సర్‌ప్రైజ్ హిట్‌గా 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' నిలిచింది. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ చిన్న చిత్రం కథాబలం గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పింది. స్వరూప్ దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల మన్ననలు అందుకుని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోను ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. చిన్న చిత్రాలకి స్క్రిప్ట్ కంటే ఎస్సెట్ ఏమీ వుండదని 'బ్రోచేవారెవరురా' విజయంతో చాటుకుంది. వివేక్ ఆత్రేయ రైటింగ్ టేబుల్ మీదే సక్సెస్ ఖాయం చేసుకున్న ఈ చిత్రం కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్‌కి కష్టాలకి 'రాక్షసుడు'తో ఊరట లభించింది. ఓంకార్ 'రాజు గారి గది' మూడవ సారి కూడా జనాన్ని రాబట్టింది.
ఏడాది చివర్లో వచ్చిన ప్రతిరోజూ పండగే క్రిస్మస్ సీజన్‌లో కలక్షన్లలో పండుగ చేసుకుంది. సాయి ధరమ్ తేజ్, మారుతిల కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే దిశగా ఈ చిత్రం దూసుకెళుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌కి వున్న రీచ్, మైలేజ్ ఈ చిత్రం మరోసారి తెలియజెప్పింది. అడివి శేష్ 'ఎవరు' అనేది మళ్లీ ప్రూవ్ అయింది. అతనిపై ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ చిత్రం మరింత పెంచింది. తెరపై వాల్మీకి పోస్టర్‌పై 'గద్దలకొండ గణేష్'గా మారినా… నేములోనేముంది అంటూ ప్రేక్షక లోకం వరుణ్ తేజ్ వికటాట్టహానికి విజయాన్ని కట్టబెట్టింది. 'మార్పుల' స్పెషలిస్టుగా హరీష్ శంకర్‌కి ఈ రీమేక్ మంచి మార్కులే ఇచ్చింది. వాయిదాల మీద వాయిదాలతో రిపోర్టర్ 'అర్జున్ సురవరం' ఇచ్చిన లేట్ రిపోర్ట్ పాస్ అయిపోయింది. మమ్ముట్టి 'యాత్ర' జయప్రదం కాగా, కళ్యాణ్‌రామ్ '118' డయల్ చేస్తే సక్సెస్ రింగ్‌టోన్ వినిపించింది. ఆరు ఫ్లాపుల పరంపరకి అయిదు పాత్రల 'చిత్రలహరి'తో మెగా మేనల్లుడికి రిలీఫ్ దక్కింది. ఏడాది చివర్లో 'మత్తు వదలరా' చిన్న మెరుపులా మెరిసింది. పరభాషా చిత్రాలకి ఆదరణ తగ్గిన సమయంలో కూడా లారెన్స్ 'కాంచన 3' బాక్సాఫీస్ దగ్గర ప్రతాపం చూపించింది. దీపావళికి విజయ్ వేసిన 'విజిల్' బాగానే మోగింది. లోకేష్ కనగరాజ్ క్రియేటివిటీ కార్తీ చిత్రానికి ప్రేక్షకులని 'ఖైదీ'ని చేసింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ జగజ్జేత అవడంలో తెలుగు ప్రేక్షకుల కాంట్రిబ్యూషన్ కూడా వుంది.
బయ్యర్ల కష్టాల కన్నీళ్లు!
సావిత్రి జీవిత కథకి నలభై కోట్లు వస్తే ఎన్టీఆర్ కథకి ఇంకెంత రావాలంటూ అంచనాలు వేయించిన 'ఎన్టీఆర్' బయోపిక్ మొదటి భాగానికి వచ్చిన ఫలితం ఈ ఏడాదికి మొదటి షాక్ ఇవ్వడంతో పాటు రెండవ భాగం విడుదల చేయాలా వద్దా అనే మీమాంసకి మేకర్లని లోను చేసింది. భయపడ్డట్టుగానే బయోపిక్ తాలూకు ద్వితీయ భాగం చారిత్రాత్మక పరాజయంగా రికార్డులకెక్కింది. ఏడాది ఆరంభంలో ఎదురైన పరాజయానికి కనీసం ఏడాది చివర్లోను ఉపశమనం ఇచ్చేది లేదంటూ 'రూలర్' దెబ్బ మీద దెబ్బ తగిలితే కలిగే నొప్పిని బాలకృష్ణ అభిమానులకి ఇంకోసారి అనుభవంలోకి తెచ్చింది.
మాస్ మసాలా మోతాదుకి మించనంత వరకు బోయపాటి శ్రీను ఏది చేస్తే అదే సినిమా అయింది. ఒక్కసారి ఆ డోసు పెరిగితే 'వినయ విధేయ రామ' బయ్యర్ల పాలిట విలయ విలాపమయింది. 'మన్మథుడు 2' అనేస్తే ఆ క్లాసిక్‌ని గుర్తు చేసుకుని జనం ఎగబడతారని అనుకున్నారు కానీ ఈ టైటిల్ వల్ల ఆ క్లాసిక్ గుర్తుకొచ్చి మరింతగా తిట్టించుకోవాల్సి వచ్చింది. మొదటి విజయం అనుభూతి కోసం 'మిస్టర్ మజ్ను' అఖిల్‌ని మరికొంత కాలం వెయిట్ చేయించింది.
'గీత గోవిందం' విజయ్-రష్మికకి 'డియర్ కామ్రేడ్' చేదు జ్ఞాపకమయింది. లేడీ గ్యాంగ్‌తో వచ్చిన నానిని 'గ్యాంగ్ లీడర్' రాంగ్ సైడ్ పార్క్ చేసింది. మంచు విష్ణు 'ఓటర్'కి డిపాజిట్లు గల్లంతయ్యాయి. రాజశేఖర్ గరుడ వేగానికి 'కల్కి' బ్రేక్స్ వేసింది. ఆయన కుమార్తె శివాత్మిక 'దొరసాని' బాక్సాఫీస్ వద్ద భంగపడింది. శ్రీహరి తనయుడు 'రాజ్‌దూత్'కి పెట్రోల్ కొరవడింది. విజయ్ దేవరకొండ నిర్మాతగా చేసిన మొదటి అటెంప్ట్ 'మీకు మాత్రమే చెప్తా' అతనికి మాత్రమే డబ్బులు తెచ్చింది. రవిబాబు బుర్రలో ఐడియాలు 'ఆవిరి' అయిపోయాయని సింబాలిక్‌గా చెప్పినట్టయింది.
గోపీచంద్ 'చాణక్యానికి' దసరా పండగ కూడా ఆసరా కాలేకపోయింది. 'రణరంగం'లో శర్వానంద్‌ని పరాజయం పలకరించింది. తేజ తీసిన అభినవ 'సీత'కి వనవాసమే శరణ్యమయింది. ఆర్‌ఎక్స్ 100 జోడీకి ఈ ఏడాది పీడకలగా మారింది. హిట్‌ని రిపీట్ చేయడమెంత కష్టమో 'హిప్పీ' కార్తికేయకి తెలియజెప్పింది. ఫ్లాప్‌ని కంటిన్యూ చేయడమెంత ఈజీ అనేది కూడా 'గుణ 369', '90 ఎంఎల్'తో అతనికి తెలిసొచ్చింది. విషయం లేని సినిమాలో ఎంత గ్లామర్ చిలికినా 'ఆర్‌డీఎక్స్ (లవ్)' సైతం తుస్సుమంటుందని పాయల్ రాజ్‌పుత్‌కి బోధపడింది. నిహారిక 'సూర్యకాంతం'కి చంద్రగ్రహణం పట్టింది. అల్లు శిరీష్ 'ఏబిసిడి' దిద్దే లోపే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా 'ఎక్స్‌వైజెడ్' రాసేసింది.
తెనాలి రామకృష్ణ బిఏ. బిఎల్. థియేటర్లకి జనం ఎందుకు రాలేదంటూ 'లా' పాయింట్లు లాగాల్సి వచ్చింది. బాలకృష్ణ, కార్తికేయతో పాటు ఆదికి కూడా హ్యాట్రిక్ దొరికింది. బుర్రకథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్‌ఫిష్‌తో ఆది కెరీర్ ఆపరేషన్ బెడ్ ఎక్కింది. 'తిప్పరా మీసం' అంటూ వచ్చిన శ్రీవిష్ణుని ప్రేక్ష జనం తిప్పి పంపేసింది. 'రాగల 24 గంటల్లో' ఏమి జరుగుతుందో తెలుసుకునే లోపే తిరుగుటపాలో వెళ్లిపోయింది. 'తోలుబొమ్మలాట' చూసే రోజులు కావని రాజేంద్రప్రసాద్‌కి ఆలస్యంగా తెలిసింది. 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' చూపిస్తాడని శ్రీనివాసరెడ్డి సినిమాకెళ్లిన ఆ కొద్ది మందికీ మత్తుగా నిద్ర పట్టింది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తినిపించిన 'మిఠాయి' చేదుగా వుంది. 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' అంటూ రాజకీయ పరిస్థితులని క్యాష్ చేసుకోవాలని చూసిన వర్మ సినిమా థియేటర్లలో ఈగలు తోలుకోవాల్సి వచ్చింది. ఏదో చేసేస్తాడనుకున్న జార్జి రెడ్డి ట్రెయిలర్ దాటి పిడికిలి బిగించలేకపోగా, ఎంతో ఉంటుందనిపించిన 'రాజావారు రాణిగారు' ప్రజల్లేని థియేటర్లని ఏలాల్సి వచ్చింది.
ఆరంభ శూరత్వం చూపించి అంతిమంగా అంతంత మాత్రంగా ఆడిన సినిమాల చిట్టా బాగానే వుంది. వెంకీమామకి ఈ లిస్టులో ప్రథమ తాంబూలం దక్కుతుంది. అలాగే సందీప్ కిషన్ నిర్మాతగా చేసిన తొలి యత్నం 'నిను వీడని నీడను నేనే' కూడా ఈ కోవకే చెందుతుంది. విశ్వక్‌సేన్ 'ఫలక్‌నుమా దాస్'ది కూడా ఇదే బాపతు స్టోరీ. 'మల్లేశం'కి జేబులో చెయ్యి పెట్టి టికెట్ కొన్న వారి కంటే భుజం తట్టి మెచ్చుకున్న వారి లిస్టు పెద్దదుంటుంది.
ఓవరాల్‌గా 2019 తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ప్రయత్న లోపమయితే లేదు కానీ ఫలితమే ఆశించినట్టుగా రాలేదు. సక్సెస్ శాతం ఎప్పట్లానే వుంది కానీ ఈసారి అందులో పెద్ద సినిమాల కాంట్రిబ్యూషన్ కంటే చిన్న సినిమాల జాబితా పెద్దదుంది. మరి ఈ యేడాది నేర్పిన పాఠాలతో ఈసారి ఇంకాస్త మెరుగ్గా, మరింత తెలివిగా, ప్రణాళికాబద్ధంగా పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేస్తే సరి.
గణేష్ రావూరి