ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సూటిగా స్పందించారు. హైదరాబాద్ ను తలదన్నే రాజధాని తయారవ్వాలంటే విశాఖ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు. అతి త్వరగా రాజధానిగా రూపుదిద్దుకునే హంగులు, సౌకర్యాలన్నీ విశాఖకు ఉన్నాయన్నారు. ఇన్ని చెప్పిన బొత్స, ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలన్నారు.
“విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టాలని, సీఎం క్యాంప్ ఆఫీస్, సెక్రటేరియట్ పెట్టాలని నివేదికలో ఉంది. అమరావతి ప్రాంతంలో శాసనసభతో పాటు సీఎంకు మరో క్యాంప్ ఆఫీస్, గవర్నర్ బంగ్లా ఉండాలని.. కర్నూలులో హైకోర్టు పెడుతూనే.. అమరావతి, విశాఖలో ఓ బెంచ్ ఉండాలని నివేదిక చెప్పింది. రాష్ట్ర విభజన సమయంలో మనమంతా ఒకటే బాధపడ్డాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని మళ్లీ మనం తయారుచేసుకోగలమా అని బాధపడ్డాం. హైదరాబాద్ ను తలదన్నే నగరం తయారవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంతోనే సాధ్యం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.”
దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటిగా ఉందని.. అలాంటి నగరాన్ని విస్మరించి రాజధాని గురించి ఆలోచించడంలో అర్థంలేదన్నారు. స్వార్థ రాజకీయాలు చేసే చంద్రబాబు, తన హయాంలో ఈ విషయాన్ని విస్మరించారని ఆరోపించిన బొత్స… వెనకబడిన ప్రాంతాల (ఉత్తరాంధ్ర) అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టమా కాదా అని ప్రశ్నించారు.
“ఏ రకంగా ఆలోచించినా విశాఖకు మించిన నగరం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం భారతదేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. ఈ నగరానికి ఏమాత్రం చేయూతనిచ్చినా, దీన్ని హైదరాబాద్ ను తలదన్నే నగరంగా తయారుచేసుకోవచ్చు. తద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవచ్చు.”
రాజధాని అంశానికి సంబంధించి కేంద్రానికి సమాచారం ఇస్తే సరిపోతుందని, వాళ్లకు రిపోర్ట్ ఇచ్చి చర్చలు జరపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు బొత్స. రాష్ట్రంలో ఎక్కడ రాజధాని నిర్మించుకున్నప్పటికీ, విభజన చట్టం ప్రకారం నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందన్నారు.
ఇక అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతుల గురించి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చెప్పినట్టుగానే హామీల్ని అమలు చేస్తామని, రైతులకు న్యాయం చేస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నప్పటికీ, చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ నేతలంతా రైతుల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు బొత్స.