ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు… పూర్తిగా తెలుగుదేశం మహాసభలుగా మారిపోయాయి. ఇంగ్లిష్ మీడియం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాల మీద తీర్మానాలు చేస్తున్నారు కానీ, ఏ ఒక్కరూ తమ పిల్లలు ఏ మీడియంలో చదువుతున్నారో చెప్పే ధైర్యం చేయలేదు. తెలుగు భాషకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అనే ముద్ర వేసేందుకు తెగ తాపత్రయ పడుతున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఈ వార్తల్ని హైలెట్ చేస్తూ పబ్బం గడుపుతోంది.
జనాలు ఛీ కొట్టడంతో కాస్త వెనక్కి తగ్గిన సోకాల్డ్ తెలుగు భాషాభిమానులంతా ఈ సభల సాకుతో మరోసారి ఫైర్ అవుతున్నారు. ఇంగ్లిష్ మీడియాన్ని, వైసీపీని టార్గెట్ చేయాలని అనుకున్నారు కాబట్టి, ఆ పార్టీ నేతలు మినహా మిగతా వారినంతా ఆహ్వానించారు, తెలుగు మీడియంపై గోలచేయించారు. తెలుగుదేశం, బీజేపీ, వామపక్షాల నేతలు సైతం స్టేజీ ఎక్కి వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం కొనసాగించాలని రచ్చ చేశారు.
తెలుగు రచయితల సభలు అంటే తెలుగు భాష గురించి మాట్లాడతారు, కొత్తగా వచ్చి పుస్తకాల పరిచయం, రచనల్లో వచ్చిన నూతన పోకడలు.. ఇలాంటి వాటి గురించి చర్చిస్తారనుకుంటాం. కానీ విచిత్రంగా ఇవికాస్తా తెలుగుదేశం సభల్లా మారిపోయాయి, కేవలం వైసీపీ విధానాలను విమర్శించడానికే పరిమితమయ్యాయి.
విచిత్రం ఏంటంటే.. అసలు తెలుగు మీడియంపై అంతెత్తున లేచిన పవన్ కల్యాణ్ కి ఆహ్వానం లేకపోవడం. ఒకవేళ ఆహ్వానం ఉన్నా పవన్ వెళ్లి ఉండేవారు కాదేమో. ఎందుకంటే.. ఇప్పటికే తెలుగు మీడియ వ్యవహారంపై పవన్ కి బాగా జ్ఞానోదయం అయింది. మొత్తమ్మీద కేవలం వైసీపైని విమర్శించడానికే ఈ తెలుగు మహాసభలు ప్రాధాన్యం ఇచ్చాయి, పచ్చ తెలుగు మహా సభల్లాగా మారిపోయాయి.