తెలుగు సినిమా ఇక తగ్గేదేలే

అందుకే హిందీలో సినిమా తీయడం ఒక లక్ష్యంగా ఉండేది చాలామంది దక్షిణాది దర్శకులకి.

ఒకప్పుడు బాలీవుడ్ అంటే గొప్ప. ఎందుకంటే దాని మార్కెట్ పెద్దది. కనుక ఫేం కూడా అక్కడ వచ్చినంతగా ప్రాంతీయ సినిమాల ద్వారా వచ్చేది కాదు. అందుకే హిందీలో సినిమా తీయడం ఒక లక్ష్యంగా ఉండేది చాలామంది దక్షిణాది దర్శకులకి.

హిందీ సినిమాలు తీసిన తెలుగు దర్శకుల పేర్లు చెప్పమంటే మొదట గుర్తొచ్చే పేరు రాం గోపాల్ వర్మ. కానీ ఆయనకంటే ముందే రాఘవేంద్ర రావు, కె విశ్వనాథ్ వంటి దిగ్గజ దర్శకులు హిందీ సినిమాలు చేసారు. తమిళం నుంచి కె బాలచందర్, మణిరత్నం వంటివారు సరేసరి. కానీ కాలక్రమంలో తెలుగు సినిమా తన రేంజుని పెంచుకుంటూ వచ్చింది. తమిళ సినిమా తర్వాతే తెలుగు సినిమా అన్నట్టుగా చాలా ఏళ్లు గడిచినా, బాహుబలి దెబ్బకి తెలుగు సినిమా కీర్తి దేశాన్ని నివ్వెరబోయేలా చేసింది.

“దంగల్” చిత్రం బాహుబలి కంటే ఎక్కువే చేసిందని చెప్పుకున్నా అందులో సింహభాగం చైనా కలెక్షన్లే. దాని తర్వాత ఆ స్థాయి హిందీ సినిమా లేదనే చెప్పాలి. స్వదేశంలో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన మొదటి చిత్రం బాహుబలి-2 మాత్రమే. ఆ తర్వాత లైన్లో ఉన్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆ రెండు రాజమౌళి సినిమాలే.

అటు పిమ్మట కన్నడ చిత్రరాజం కేజీఎఫ్-2 ఉంది. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ జవాన్. అంటే దంగల్ కి జవాన్ కి మధ్య మూడు దక్షిణాది చిత్రాలు, అందులో రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాత మళ్లీ రెండు చిత్రాలు తెలుగే- కల్కి, ప్రస్తుతం ఆడుతున్న “పుష్ప-2”.

“పుష్ప-2” ఎలాగూ కల్కిని, జవాన్ ని దాటడం తధ్యం అని తెలుస్తూనే ఉంది. ఈ రెండవ వారంతానికి ఎన్ని స్థానాలు ఎగబాకుతుందో చూడాలి.

ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే, టాప్ 10 అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల్లో ఏడు సినిమాల దర్శకులు దక్షిణాది దర్శకులే. ముగ్గురు మాత్రమే ఉత్తర భారతీయులు. ఆ ఏడు చిత్రాల దర్శకుల్లో ఒక్కడే తమిళ దర్శకుడు- జవాన్ తీసిన అట్లీ. ఇక మిగిలిన దర్శకులు- రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ అశ్విన్, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ.

ఇక్కడ తెలుగు సినిమా ఖ్యాతి మాత్రమే కాదు, తెలుగోడి కీర్తిని కూడా చెప్పుకోవాలి. తెలుగువాడికే దేశం మొత్తాన్ని ఊపగలిగే మాస్ సినిమాలు తీసే శక్తి ఉందా? ప్రస్తుతానికి ట్రెండలానే ఉంది. తెలుగువాడి సినిమాని వెనక్కి తోయాలంటే మళ్లీ తెలుగువాడే తీయాలి అన్నట్టుంది.

దానికి కారణాలు కొన్ని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ధరలకి టికెట్లు అమ్మడం వల్ల పుష్ప-2 కి ఇంతటి కలెక్షన్స్ వస్తున్నాయి తప్ప లేకపోతే అంత సీన్ లేదని అంటున్నారు. అందులో అర్ధసత్యం మాత్రమే ఉంది. ఎందుకంటే ధరలు పెంచిన తెలుగు రాష్ట్రాలకంటే ధరలు పెంచని హిందీ బెల్టులో ఈ సినిమా ఎన్నో రెట్లు విపరీతంగా ఆడుతోంది. అమెరికాలో కూడా హిందీ వర్షన్ కి బ్రహ్మరధం పడుతున్నారు. జాతీయ స్థాయి ప్రేక్షకుల నాడిని తెలుగు సినిమా పట్టుకున్నట్టు హిందీ సినిమాల వాళ్లు కూడా పట్టుకోలేకపోతున్నారు.

పోనీ ఏ హిందీ సినిమా అన్నా దేశం మొత్తాన్ని కుదిపేసి ఈ తెలుగు సినిమాలని తొక్కేయగలిగే కలెక్షన్లు రాబట్టగలదా అంటే కష్టం. ఎందుకంటే షారుఖ్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి హీరోలకి తెలుగు మార్కెట్లో ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. కనుక వాళ్ల లిమిట్ నార్త్ వరకే. రణబీర్ కపూర్ అయినా “యానిమల్” తో కాస్త హల్చల్ చేయగలిగాడంటే అది అతని గొప్పతనం కాదు. సందీప్ రెడ్డి వంగాకి తెలుగునాట ఉన్న మాస్ ఫాలోయింగ్. వాళ్లతో పోలిస్తే ప్రభాస్, అల్లు అర్జున్ లకి నార్త్ లో యూత్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.

అదొక్కటే కాదు. తెలుగు సినిమాకి ఉన్న అదృష్టం మరొకటుంది. అమెరికాలో తెలుగు సినిమాకి ఉన్నంత ఫాలోయింగ్ ఏ దక్షిణాది భాషా చిత్రాలకి లేదు. ఆ ఆదరణ ఒకటి బాగా ప్లస్సవుతోంది. అక్కడ డాలర్ల వర్షం కురుస్తోంది.

ప్రస్తుతానికి తమిళ సినిమా ఈ రేసులో చాలా వెనకబడి ఉంది. బాక్సాఫీసుల వద్ద తెలుగు సినిమా రీసౌండ్ చేస్తుంటే, ఓటీటీల్లో మళయాళ సినిమాలు మీసం మెలేస్తున్నాయి. కన్నడ సినిమాలు కూడా- కేజీఎఫ్, కాంతార తరహాలో అడపదడపా ప్రయత్నాలు చేస్తున్నాయి. హిందీ సినిమా తెలుగు సినిమాల వీరంగాన్ని చూస్తూ నోరెళ్లబెడుతున్నాయి. పోటీ పడే ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఆధిపత్యం మాత్రం తెలుగుదే అన్నట్టుంది భారతీయ సినిమా రంగంలో.

రానున్న చిత్రాల్లో రాజమౌళి-మహేష్ బాబు చిత్రానికి వద్దన్నా క్రేజ్ బిల్డవుతుంది. ఎలా బిల్డ్ చేయాలో కూడా రాజమౌళికి వెన్నతో పెట్టిన విద్య.

క్రేజ్ తెచ్చుకోబోయే రెండో చిత్రం ప్రభాస్- సందీప్ వంగా ల “స్పిరిట్”. ఈ చిత్రానికున్న మాస్ అంచనాలకి ట్రైలర్ కూడా వేడి పెంచితే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో ఊహించుకోవడమే కష్టం. ఎందుకంటే “యానిమల్” తో సందీప్ వంగా, “కల్కి” తో ప్రభాస్ బాక్సాఫీస్ ని కొల్లగొట్టారు. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిస్తే ఎలా ఉంటుందనేది బాలీవుడ్ వర్గాలకి కూడా ఊహకి అందని విషయం. కంటెంట్ ఏ మాత్రం బాగున్నా రెండు చిత్రాలు చెరొక 2000 కోట్లు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.

ఇదే ఊపు కొనసాగితే తెలుగు సినిమాయే భారతీయ చిత్రపరిశ్రమని ఏలుతుంది. తెలుగు హీరోలు జాతీయస్థాయి నటులవుతున్నారు, ఇంకా అవుతారు. తెలుగు సినిమా తన సరిహద్దుల్ని చెరిపేసుకుని కళాత్మక దండయాత్ర చేసుకుంటూ పోతోంది. ఇక మిగిలిందల్లా హాలీవుడ్ కి సమాంతరంగా నిలబడడం. ప్రపంచస్థాయి ప్రేక్షకులందర్నీ వశం చేసుకోగలిగే సినిమాలు తీయగలగడం. ఆస్కార్ ప్రచారంలో భాగంగా స్పీల్ బెర్గ్, కేమరూన్లు రాజమౌళిని కొనియాడారు. “ఆలోచన ఉంటే చెప్పు ఇద్దరం కలిసి సినిమా తీద్దాం” అని అవతార్ దర్శకుడు కేమరూన్ సైతం రాజమౌళితో అన్నాడు. అంటే తెలుగు సినిమా హాలీవుడ్ ని కొద్దిగా కదిపింది. ఇక కుదపడం జరగాలి. మన దర్శకులు ఆ దిశగా కూడా తమ శక్తుల్ని ఒడ్డుతారని ఆశిద్దాం.

శ్రీనివాసమూర్తి

20 Replies to “తెలుగు సినిమా ఇక తగ్గేదేలే”

  1. తెలుగు హీరోలు డైరెక్టర్లు PAN ఇండియా సినిమాలతో భారీ విజయాలు సాధిస్తున్నారంటే ఖచ్చితంగా గర్వించాల్సిన విషయమే. ఇదివరకు నేను తెలుగు వాడిని అంటే “ఓహో, నువ్వు మద్రాసీవా?” అనేవారు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటులు, దర్శకుల పుణ్యమా అని అందరికి తెలుగు భాష గురించి రాష్ట్రాల గురించి గట్టిగా తెలుస్తోంది .

    ఐతే, మాస్ సినిమాలు, హీరోయిజం ఆధారిత సినిమాలతో పాటు, హిందీలో వచ్చిన 12th ఫెయిల్, లాపతా లేడీస్ లాంటి అద్భుతమైన సెన్సిబుల్ కథలతో కూడా సినిమాలు తీస్తే తెలుగు సినిమా కీర్తి ఇంకా పెరుగుతుంది. అటువంటి సినిమాలు కూడా వస్తాయి అని ఆశిద్దాం.

  2. Mana films ki Hindi version click aithene ee success, only telugu version midha intha dabbu raadu. Meranna US market lo difference oka 2-3 millions untadi (Gross). Kaani, Hindi vallaki manaki hyderabad unnattu Bollywood ki Indiawide 8 metros unnayi & big canada & arab market kooda, money antha hindi market lone undi. Pushpa ki taran adarsh & other bollywood analysts lantivallu 4.5 stars ichaara, ika paid rating ivvakumte idhi sadhyamayyedhi kaadu

  3. చదువుల విప్లవాన్ని తెలుగు వారు బాగా పెంచుకుంటున్నారు. చదువు మూలనే ఆలోచన శక్తి పెరుగుతోంది అందుకే మన వాళ్ళు దేశంలో బాగా రాణిస్తున్నారు

  4. సినిమా లు ఎన్ని వేల కోట్లు గడించినా.. అది ప్రజల డబ్బు.. కొంత మంది వీటి వల్ల బాగుపడతారు.. అంతకు మించి ఉపయోగం ఏమి లేదు.. కుటుంబ సమేతంగా సినిమా చూడడం అంటే డబ్బులిచ్చి బ్రష్టు పట్టడం…

  5. Telugu media and telugu people should come out of this jingoistic and narrow minded mentality of doing self dabba and ranting telugodu this and telugodu that. North Indians and other audience are not seeing the heros as outside telugu heros or the movie as non-hindi telugu movie. Non-telugu people are not thinking like u fellows in language or region angle. They are supporting the movies based with out any language/region narrow mind. So stop doing this self dabba and remove this telugu angle. Remember that the telugu industry is growing because other people are thinking broad minded and watching movies. we only see problem in tamil nadu where our movies not working much because of their narrow tamil centric thinking . If other people know that we rant about telugodi satta etc.. they will start rejecting our movies.

Comments are closed.