ఈ మధ్య తమిళ సినిమాలకు మళ్లీ క్రేజ్ కనిపిస్తోంది. దాదాపు నాలుగైదు సినిమాలు సైలంట్ గా డబ్బులు చేసుకున్నాయి. మరీ పెద్ద రేట్లు కావు కనుక తెలుగు నిర్మాతలు తమిళ సినిమాలు టేకప్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
లేటెస్ట్ గా మరో సినిమా ఇలా థియేటర్లలోకి రాబోతోంది. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగులో నిర్విరామంగా సినిమాలు తీస్తోన్న నిర్మాణ సంస్థ 'స్రవంతి మూవీస్. 'లేడీస్ టైలర్' మొదలుకొని 'రెడ్' వరకూ ఎన్నో సినిమాలు తీసారు నిర్మాత 'స్రవంతి' రవి కిషోర్. మలయాళ సినిమా యువసేన, తమిళ సినిమాలు ‘నాయకుడు', 'పుష్పక విమానం', 'రెండు తోకల పిట్ట', 'రఘువరన్ బి.టెక్' ఇలా ఆయన టేకప్ చేసిన అనువాదాలన్నీ పెద్ద హిట్టే.
కొంత విరామం తర్వాత ఆయన మళ్లీ ఓ డబ్బింగ్ సినిమా టేకప్ చేస్తున్నారు. శింబు హీరో గా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన 'వెందు తనిందదు కాడు' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో శింబు వైవిధ్యమైన పాత్ర అనే కన్నా పాత్రలు పోషించాడు అని చెప్పాల్సిందే. చిన్నతనం నుంచి ఓల్డ్ ఏజ్ వరకు వివిధ గెటప్ ల్లో కనిపిస్తాడు. కోవిడ్ కారణంగా చిరకాలం షూట్ చేసుకున్న ఈ సినిమాకు నిర్మాణ వ్యయం కూడా ఎక్కువే.
ఈ నెల 15 నే ఈ సినిమా రిలీజ్. ఆఖరి నిమిషంలో ఆయన చేతికి వచ్చిందీ ప్రాజెక్ట్. తమిళంలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇంకా వారమే గడువు ఉంది. ఇంత తక్కువ సమయంలో దీన్ని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకు వెళ్తారో చూడాలి. 'మానాడు' తర్వాత తమిళంలో శింబు చేసిన సినిమా ఇదే. శింబుకి హీరో రామ్ తో కూడా మంచి రిలేషన్ ఉంది.
'ది వారియర్' లో బుల్లెట్ సాంగ్ ని శింబునే పాడారు. ఆ అనుబంధంతో శింబు సినిమాకి ఇక్కడ రామ్ ప్రమోట్ చేసే అవకాశం కూడా ఉంది.