కొంతమంది తిడుతున్నారు, నాకు తెలుసు – తమన్

బ్రో సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించి వస్తున్న నెగెటివ్ టాక్ ను అంగీకరించాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఆ సాంగ్ కొంతమందికి నచ్చిందని, మరికొంతమంది మాత్రం తిడుతున్నారని ఒప్పుకున్నాడు. సినిమా ప్రమోషన్ లో…

బ్రో సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించి వస్తున్న నెగెటివ్ టాక్ ను అంగీకరించాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ఆ సాంగ్ కొంతమందికి నచ్చిందని, మరికొంతమంది మాత్రం తిడుతున్నారని ఒప్పుకున్నాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడాడు. బ్రో, గుంటూరుకారం లాంటి సినిమాలపై స్పందించాడు.

– బ్రో సాంగ్ కు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సాంగ్ పై ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కడుపుకు ఎంత అన్నం పెట్టాలో అంతే పెట్టాలి. ఈ సినిమాకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఫ్యాన్స్ ఎక్కువగా అడుగుతారు కానీ ఏం చేయలేం. సినిమా ఏం అడుగుతుందో అదే ఇవ్వాలి. అందరం డిసైడ్ చేస్తేనే ఆ సాంగ్ వచ్చింది. ఈ సినిమాకు ఇంతే. మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చిందనేది నేను ఒప్పుకుంటున్నాను. కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. కొందరు తిడుతున్నారు. ఎప్పుడో చేసిన పాటలా ఉందంటున్నారు. నేనేం చేయలేను. ఓ కథగా అక్కడ రావాల్సిన మ్యూజిక్, లిరిక్స్ అంతే.

– మ్యూజిక్ పక్కనపెట్టి క్రికెట్ ఆడుతున్నానని కొంతమంది అంటున్నారు, చాలా బాధేసింది. పని వదిలేసి నేను వెళ్లను. రాత్రి 9 తర్వాతే క్రికెట్ ఆడతాను. క్రికెట్ నా ఎమోషన్. దీన్ని కూడా తప్పుపడుతున్నారు. నా బాధ ఏంటంటే, నా గురించి తెలిసిన వాళ్లే తప్పుగా రాస్తున్నారు. ఇప్పటివరకు ఒక్క దర్శకుడు కూడా నాపై కంప్లయింట్ చేయలేదు.

– గుంటూరు కారం సినిమాపై 6 నెలలుగా వర్క్ చేస్తున్నాం. స్క్రిప్ట్ ఛేంజెస్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడన్నీ సెట్ అయిపోయాయి. ఈ సినిమా నుంచి నన్ను తీసేశారనే ప్రచారం జరిగింది. నన్ను తీసేస్తే నిర్మాతలే ఆ విషయం చెబుతారు కదా. అలాంటి నెగిటివిటీ గురించి నేనెందుకు స్పందించాలి.

– అదేంటో అంతా గుంటూరు కారం సినిమాపైనే పడ్డారు. ఎన్నో సినిమాలు ఆగిఆగి షూట్ జరుపుకున్నాయి. కానీ దీన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు. నాలుగేళ్లు షూటింగ్ జరుపుకున్న సినిమాలున్నాయి, వాటిపై ఏం రాయలేదు, గుంటూరు కారంపై మాత్రం రాస్తున్నారు.

– గుంటూరుకారం అనే టైటిల్ ఈ సినిమాకు పెర్ ఫెక్ట్. ఇంతకుముందు చాలా టైటిల్స్ వచ్చాయంటూ ప్రచారం జరిగింది. అలాంటిదేం లేదు. బిగినింగ్ నుంచి ఇదే టైటిల్ అనుకున్నాం, అదే టైటిల్ పెట్టాం.

– ఇక బ్రో విషయానికొస్తే.. ఈ సినిమా డిఫరెంట్ మూవీ. అఖండ లాంటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇందులో ఆశించొద్దు. మంచి మూమెంట్స్ ఉన్నాయి, అవి చూసి కన్నీళ్లు పెట్టుకుంటాం. సినిమాలో డైలాగ్స్ ను అంతా ఎంజాయ్ చేస్తారు. మరీ ముఖ్యంగా పవన్-సాయితేజ్ ను కలిపి చూడడం ఫెంటాస్టిక్ మూమెంట్. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం కష్టమైంది. సినిమాలో అక్కడక్కడ బిట్ సాంగ్స్ ఉన్నాయి. వాటిని కంపోజ్ చేయడం టఫ్ అనిపించింది.

– బ్రో సినిమాలో కమర్షియల్ గా పెద్ద సాంగ్స్ ఏం లేవు. భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ టైపులో మాస్ సాంగ్స్ లేవు. కాకపోతే కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వేరేలా ఉంటుంది. సీన్స్ ను ఎలా ఎలివేట్ చేశామో సినిమా చూస్తే తెలుస్తుంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను హ్యాపీ.

– నిర్మాణరంగంపై ఆసక్తి ఉంది. కానీ ప్రస్తుతానికి టైమ్ లేదు, నమ్మకమైన వ్యక్తులు కూడా లేరు. మా తాత నిర్మాతే. ప్రతిభ మూవీస్ బ్యానర్ మా తాతగారిదే. దాన్ని నేను రిజిస్టర్ చేయించి పెట్టుకున్నాను.

– పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రభావం మాపై కచ్చితంగా ఉంటుంది. తెలుగు, హిందీకి మ్యూజిక్, లిరిక్స్ మారిపోతుంటాయి. పాన్ ఇండియా అనేది చాలా పెద్ద బాధ్యత.

– ధోనీ అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే పిచ్చి. నా స్టుడియోలో కూడా ధోనీ ఫొటో ఉంటుంది. ధోనీ కొన్న బ్యాట్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆయన ప్రొడక్షన్ లో మ్యూజిక్ కంపోజ్ చేసే అవకాశం వస్తే రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తాను.

– పాట పాడమని పవన్ కల్యాణ్ ను అడిగే ధైర్యం చేయలేను. ఇప్పటివరకు అడగలేదు. ఆయనపై ఎంత ప్రేమ ఉందో అంతే గౌరవం కూడా ఉంది. 5 అడుగులు దూరంగానే ఉంటాను. ఏదో వరుసగా సినిమాలు ఇస్తున్నారు కదా అని పాట పాడమని అడిగేంత సాహసం చేయను.