తన ట్యూన్స్ తానే కాపీ కొడతాడనే విమర్శను కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎదుర్కొంటున్నాడు మ్యూజిక్ డైరక్టర్ తమన్. ప్రస్తుతం స్టార్ స్టేటస్ వచ్చినప్పటికీ, ఇంకా ఆ విమర్శలు తమన్ ను వీడి పోవడం లేదు. తాజాగా సర్కారువారి పాట సినిమాతో మరోసారి కాపీ క్యాట్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.
సర్కారువారి పాట సినిమాలో సూపర్ హిట్టయింది కళావతి సాంగ్. ఈ పాట పల్లవి వరకు ఓకే కానీ, చరణాల విషయానికొచ్చేసరికి మాత్రం తమన్ తన పాత బాణీల్నే రిపీట్ చేశాడనేది ఆరోపణ. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా క్లిప్పులు ప్రత్యక్షమయ్యాయి కూడా. వీటిపై తమన్ స్పందించాడు. ఫ్లోలో అలా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు.
“ఏదైనా కాపీ కొట్టినట్టు అనిపిస్తే అందరికంటే ముందు నా టీమ్ రెస్పాండ్ అవుతుంది. నాకు 14 మంది సభ్యుల టీమ్ ఉంది. కాపీ కొడితే చెప్పేసే మంచి యాప్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. కాపీ కొడుతున్నాం అనే ఫీలింగ్ తో మేం పనిచేయలేదు. మేమంతా ఫ్రెష్ గానే వర్క్ చేశాం. నా ట్యూన్ నే నేను రిపీట్ చేశాననే విషయాన్ని జనం చెబితే తప్ప నాకు తెలియలేదు. కంపోజ్ చేసే టైమ్ లో కాపీ కొడుతున్నామని మాకు తెలీదు. మేం ఫ్లోలో పనిచేసుకుంటూ వెళ్లిపోయాం అంతే. పైగా నా ట్యూన్ ను నేనే కాపీ కొట్టాను అంటున్నారు. కాబట్టి నేనేం పెద్దగా ఇబ్బంది పడడం లేదు.”
ఇలా తనపై రెగ్యులర్ గా వచ్చే విమర్శను తేలిగ్గా తీసుకున్నాడు తమన్. అయితే ఇదే సర్కారువారి పాట సినిమాకు సంబంధించి తమన్ మరో కాపీ కూడా కొట్టాడు. అది తన సొంత ట్యూన్ కూడా కాదు.
మ..మ..మహేషా సాంగ్ లో చరణాలు, ఇంద్ర సినిమాలో మణిశర్మ కంపోజ్ చేసిన ఓ పాటలోని చరణాలు ఒకే బాణీలో ఉంటాయి. దీనికి సంబంధించి కూడా చాలా క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో ఉన్నాయి. వీటిపై మాత్రం తమన్ స్పందించలేదు.