తనను కోలీవుడ్ చిత్రపరిశ్రమ నిషేధించిందని ప్రముఖ వివాదాస్పద గాయని చిన్మయి వాపోయారు. ‘మీటూ’ ఆరోపణలతో చిత్రపరిశ్రమలో వివాదాస్పద నటిగా ఆమె గుర్తింపు పొందారు. చిత్రపరిశ్రమలో మహిళా నటులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా దక్షిణాదిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వ్యక్తిగా గాయని చిన్మయి ముందు వరుసలో నిలిచారు.
తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. చిత్రపరిశ్రమలో మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తనపై కోలీవుడ్ నిషేధం విధించిందని చెప్పి ఆశ్చర్యపరిచారు. తనపై నిషేధాన్ని న్యాయస్థానంలో సవాల్ చేశానన్నారు. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదని ఆమె అన్నారు.
‘మీటూ’ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లను బయట పెట్టి బజారుకీడ్చినందుకు 2018 అక్టోబర్ నుంచి రాధారవి, వైరముత్తు.. కోలీవుడ్ పరిశ్రమలో నన్ను బ్యాన్ చేశారు. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది.
దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే మంచి భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం. మరి, అండగా నిలిచే కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏమిటి?’ అని చిన్మయి ప్రశ్నించారు.
చెడుకు వ్యతిరేకంగా పోరాడాలంటే చివరికి కెరీర్‌ను కూడా బలి పెట్టేందుకు వెనుతీయరాదనే వాస్తవాన్ని చిన్మయి ఉదంతం నిరూపిస్తోంది. ఒక్క చిన్మయి విషయంలోనే కాదు, వ్యవస్థ స్వభావమే అట్లా ఉంది.