ఇటీవల కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సరికొత్త నినాదానికి దారి తీసింది. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకురావాలని, ప్రచారానికి తిప్పాలంటూ పెద్ద ఎత్తున కార్యకర్తల నుంచి డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై కొంత కాలంగా సర్వత్రా చర్చ సాగుతోంది.
దీంతో పొలిటికల్ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై సహజంగానే ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించే రోజు రానే వచ్చింది. ఒక చానల్‌లో త్వరలో ప్రసారం కానున్న ఓ షోకు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఈ విషయమై మీడియాతో ముచ్చటించేందుకు ఆయన ముందుకొచ్చారు.
ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడుంటుందని సూటిగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలని జర్నలిస్టులకే చాయిస్ ఇచ్చారు. తమకు తెలియదని జర్నలిస్టులు సమాధానం ఇచ్చినా …ఆయన విడిచిపెట్టలేదు. తన నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చెప్పాలని ఎన్టీఆర్ కోరారు.
ఇది సమయం, సందర్భం కాదని జర్నలిస్టుల వైపు నుంచి సమాధానం వచ్చింది. తర్వాత తీరిగ్గా, మంచిగా వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందామని ఎన్టీఆర్ అన్నారు. కానీ చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లను భయపెట్టేలా ఎన్టీఆర్ సమాధానం ఉందని నందమూరి అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది సమయం , సందర్భం మాత్రమే కాదన్నారని, రాజకీయాల్లోకి రానని మాత్రం ఎన్టీఆర్ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు.
అంటే ఈ రోజు కాకపోతే రేపు, లేదంటే ఆ మరునాడైనా తమ అభిమాన హీరో రాజకీయాల్లోకి రావడం పక్కా అని చెప్పకనే చెప్పారని నందమూరి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంటే, లోకేశ్‌కు ఇక రాజకీయంగా నూకలు చెల్లినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఎన్టీఆర్ స్పందన తప్పకుండా తండ్రీకొడుకులని భయపెట్టేలా ఉందని చెప్పక తప్పదంటున్నారు.