జన సేనాని పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం చూస్తుంటే పాత దేవదాసు సినిమాలోని ఓ పాట గుర్తుకొస్తోంది. దాంట్లో హీరోయిన్ పార్వతి… అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగింతేనా ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా అంటూ బాధగా పాడుతుంది. ఆయన ఏం పాట పాడుకుంటున్నాడో మనకు తెలియదుగాని రాజకీయ నాయకుడు కాబట్టి బలవంతంగా బాధను దిగమింగుకుంటున్నాడు.
పవన్ బీజేపీతో ఎప్పుడైతే జత కట్టాడో అప్పటినుంచి నోరు కట్టేసుకుని కూర్చున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే స్వేచ్ఛ కోల్పోయాడు. ఆయన ఒకప్పుడు బీజేపీని తిట్టిన తిట్లకు ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు అసలు పొంతన లేదు. అవును …ఒపీనియన్స్ మార్చుకోనివాడు రాజకీయ నాయకుడు కాలేడు కదా.
ఆయన పాలిటిక్స్ లో సాధించింది ఈ విద్యే. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఓ సందర్భంలో ముఖ్యమంత్రి కాకుండా నన్నెవరూ ఆపలేరు అన్నాడు. కానీ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడు. అది ఆయన స్వయంకృతాపరాధం. జనసేన తరపున ఒకే ఒక్క అభ్యర్థి గెలవగానే యమ సంతోషపడిపోయాడు.
కానీ మొదట్లోనే పవన్ కు హ్యాండ్ ఇచ్చి జగన్ కు జై కొట్టాడు. రాపాక వరప్రసాద్ పేరుకు జనసేన ఎమ్మెల్యే అయినప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేలలో ఒకడిగా ఉన్నాడు. తాను రెండు స్థానాల్లో ఓడిపోవడం మొదటి నిరాశ అయితే, రాపాక చేజారిపోవడం రెండో నిరాశ. బీజేపీతో జతకట్టి ఏమీ మాట్లాడలేకపోవడం మూడో నిరాశ. ఆ మధ్య జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడి పాపం అభ్యర్థులను కూడా డిసైడ్ చేశాడు.
కానీ బీజీపీ అడ్డుకట్ట వేసింది. ఈ విషయంలో పవన్ కు నిరాశ కలిగినా బీజేపీ పోటీ చేయడమే మంచిదైందేమో. టీఆర్‌ఎస్ అహంకారం మీద దెబ్బకొట్టింది. జనసేన పోటీ చేసి ఉంటే ఆ స్థాయిలో సీట్లు వచ్చేవో కాదో. తిరుపతిలో పోటీ చేసే అవకాశం ఇస్తామని మాట ఇచ్చి పవన్ ను శాంతింపచేశారు. కానీ ఇప్పుడు అక్కడా నిరాశే ఎదురైంది. కానీ అది బయటకు ప్రదర్శించకుండా బీజేపీ పోటీ చేయడమే రైట్ అన్నట్లుగా మాట్లాడాడు.
ప్రతిష్టాత్మక తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసేది తామేనని హరిహర వీరమల్లు స్థాయిలో ప్రతిజ్ఞ చేసిన పవన్ కల్యాణ్.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్‌తోనూ తలపడినంత పనిచేశాడు. స్నేహం కోసం తాను చేసిన త్యాగాలకు గుర్తుగా తిరుపతిలో పోటీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరాడు. కానీ జనసేనానికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఏపీలో మిత్రులుగా కొనసాగుతున్న బీజేపీ, జనసేన ఈ సీటులో పోటీ కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. పోటీలో ఉండేది మేమంటే మేమేనంటూ రెండు పార్టీల అధ్యక్షులూ పోటాపోటీ ప్రకటనలు ఇచ్చారు.
చివరికి ఢిల్లీలో జరిగిన పంచాయితీలో.. ఎవరు పోటీ చేయాలనేదానిపై ఓ జాయింట్ కమిటీ ఏర్పాటైంది. రెండు నెలల సుదీర్ఘ మంతనాల తర్వాత కమిటీ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చింది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీనే బరిలోకి దిగాలని, వారికి జనసేన మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నాయి. దీనిపైఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దేవధర్, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు జనసేనాని పవన్ కల్యాణ్ తో తుది భేటీ నిర్వహించిన అనంతరం తిరుపతి సీటుపై మీడియాకు స్పష్టత ఇచ్చారు.
ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఉంటారని, మిత్రపక్షంగా జనసేన మద్దతు కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. తిరుపతి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ పవన్ కు నిరాశే ఎదురైనట్లయింది..